...
...
Next Story

PDS Rice : తెలంగాణలో రేషన్ బియ్యం తీసుకునేవారికి ఈ విషయం తెలుసా?

PDS Rice : రాష్ట్రంలో రేషన్ బియ్యం తీసుకునేవారికి కీలక అప్డేట్. మూడు నెలలకు సంబంధించిన బియ్యం ఒకేసారి అందిస్తున్నారు. దీంతో రేషన్ షాపుల వద్ద భారీగా లబ్ధిదారులు వస్తున్నారు.

Updated on: Apr 2, 2026, 06:51:17 IST
Advertisement

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌లో మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకే విడతలో పంపిణీ చేస్తోంది. దీంతో తెలంగాణలో ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్) కింద వరుసగా రెండో ఏడాది కూడా ముందస్తు సరఫరా జరగుతోంది. సేకరణ సీజన్‌లో రవాణా, నిల్వ పరిమితులను చెబుతూ.. జాతీయ ఆహార భద్రతా చట్టం(NFSA) కింద 2026 జూన్ వరకు కేటాయించిన ఆహార ధాన్యాలను ముందుగానే తీసుకుని పంపిణీ చేయాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.

రేషన్ బియ్యం పంపిణీ
రేషన్ బియ్యం పంపిణీ

'రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు జాతీయ ఆహార భద్రతా చట్టం(NFSA) కింద జూన్ 2026 వరకు కేటాయించిన ఆహార ధాన్యాలను ముందుగానే తీసుకుని, వాటిని లబ్ధిదారులకు వెంటనే పంపిణీ చేయాలి. నిల్వలను తీసుకున్న వెంటనే ఏప్రిల్-జూన్ నెలల పంపిణీని పూర్తి చేయాలి.' అని కేంద్రం ఆదేశించింది.

సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన అనంతరం 2025లో తెలంగాణ ఇదే తరహా విధానాన్ని అమలు చేసిందని, దీని కింద లబ్ధిదారులకు ఏప్రిల్-జూన్ కేటాయింపులను ముందుగానే అందించారని అధికారులు తెలిపారు.

అధికారుల ప్రకారం.. సుమారు 1.05 కోట్ల రేషన్ కార్డులు, దాదాపు 3.2 కోట్ల మంది లబ్ధిదారులకు 2.15 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైంది. ప్రజా పంపిణీ వ్యవస్థ కింద, ఆహార భద్రతా కార్డులు ఉన్న కుటుంబాలు తలసరి 6 కిలోల సన్న బియ్యం పొందుతాయి.

అంత్యోదయ అన్న యోజన (AAY) కార్డుదారులు 35 కిలోల బియ్యంతో పాటు 1 కిలో చక్కెరను పొందుతారు. కాగా అన్నపూర్ణ యోజన (AY) లబ్ధిదారులు 10 కిలోల సన్న బియ్యం, 5 కిలోల గోధుమలను పొందుతారు. పంపిణీ సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు సాధ్యాసాధ్యాలను అంచనా వేసిన అనంతరం ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ దుకాణాలను ప్రారంభిస్తామని ఇప్పటికే పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe