దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ అక్రమ మార్గంలో దేశంలోకి చైనా బాణాసంచాను తరలించేందుకు యత్నించిన స్మగ్లర్ల కుట్రను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ), హైదరాబాద్ అధికారులు భగ్నం చేశారు. చైనా నుంచి అక్రమంగా భారీ ఎత్తున విదేశీ బాణాసంచాను దిగుమతి చేసుకుంటున్నారనే ఖచ్చితమైన నిఘా సమాచారంతో…ఈ తతంగంపై నిఘా పెట్టింది.

కాగితాలు, స్టేషనరీ వస్తువులు, మెడికల్ గ్లోవ్స్, ప్లాస్టిక్ క్లిప్‌లు, హెయిర్ బ్యాండ్‌లు, స్టోరేజ్ వార్డ్‌రోబ్‌లు, షూ ర్యాక్‌లు తదితర గృహోపకరణాల పేరిట చైనా నుంచి షిప్పింగ్ కంటెయినర్లలో విదేశీ బాణాసంచాను నింపి రవాణా చేస్తున్నట్లు డిఆర్‌ఐ అధికారులు పసిగట్టారు. ఈ సమాచారంతో పక్కా ప్రణాళిక ప్రకారం సమన్వయంతో నిర్వహించిన తనిఖీల్లో అనుమానాస్పద కంటెయినర్లను క్షుణ్ణంగా సోదాలు చేశారు.
రూ. 12 కోట్ల విలువ…
కంటెయినర్లలో పైన ప్రకటించిన సామాన్య వస్తువుల కార్టన్ల వెనుక అత్యంత తెలివిగా దాచి ఉంచిన భారీ పరిమాణంలోని చైనా పైరోటెక్నిక్ బాణాసంచాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఈ అక్రమ బాణాసంచా మొత్తం విలువ సుమారు రూ. 12 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
భారతదేశ విదేశీ వాణిజ్య విధానం ప్రకారం…. విదేశాల నుంచి బాణాసంచా మరియు క్రాకర్స్ దిగుమతి చేసుకోవడంపై కఠినమైన నిబంధనలు, పరిమితులు ఉన్నాయి. వీటి దిగుమతికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) అనుమతితో పాటు, ఎక్స్‌ప్లోజివ్స్ రూల్స్-2008 కింద పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (PESO) నుంచి కచ్చితమైన లైసెన్సులు పొందడం అనివార్యం. ఎలాంటి చట్టబద్ధమైన లైసెన్సులు లేకుండా, తప్పుదారి పట్టించే నివేదికలు ఇస్తూ, అక్రమ మార్గంలో రహస్యంగా దిగుమతి చేసుకున్నందున కస్టమ్స్ చట్టం-1962లోని నిబంధనల ప్రకారం ఈ బాణాసంచాను డిఆర్‌ఐ అధికారులు సీజ్ చేశారు. ఈ స్మగ్లింగ్ రాకెట్ వెనుక ఉన్న సూత్రధారులపై అధికారులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు వేగవంతం చేశారు.