శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత - ఇద్దరు అరెస్ట్..!
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.1.56 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మలేషియాకు అక్రమంగా తరలించేందుకు యత్నించిన ఇద్దరు ప్రయాణికులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ విదేశీ కరెన్సీ పట్టుబడింది. ఎటువంటి చట్టబద్ధమైన పత్రాలు లేకుండా విదేశాలకు తరలిస్తున్న సుమారు రూ. 1.56 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని జప్తు చేయడమే కాకుండా… ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇద్దరు ప్రయాణికులను అరెస్ట్ చేసినట్లు డీఆర్ఏ అధికారులు వెల్లడించారు.

పక్కా సమాచారంతో సోదాలు…
డీఆర్ఐ హైదరాబాద్ జోనల్ యూనిట్ అధికారులకు అందిన స్పష్టమైన సమాచారం ఆధారంగా ఈ తనిఖీలు చేపట్టారు. అక్టోబర్ 22న హైదరాబాద్ నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్ వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చిన భారతీయ పురుష ప్రయాణికుడిని అనుమానంతో అడ్డుకున్నారు. అతడి వద్ద ఉన్న క్యాబిన్ బ్యాగేజీని సమగ్రంగా సోదా చేయగా అక్రమ రవాణా ఉదంతం వెలుగులోకి వచ్చింది.
ట్రాలీ బ్యాగ్‌లోని బట్టల మధ్య నల్లటి ప్లాస్టిక్ కవర్లో దాచిన విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో అమెరికన్ డాలర్లు, మలేషియన్ రింగ్గిట్లు ఉన్నాయి. వీటి మొత్తం విలువ భారతీయ కరెన్సీలో సుమారు రూ. 63.62 లక్షలు ఉంటుందని డీఆర్ఐ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
సదరు ప్రయాణికుడిని అధికారులు ప్రాథమికంగా ప్రశ్నించిన సమయంలో మరో కీలక విషయం బయటపడింది. తనతో పాటు ఒక మహిళా ప్రయాణికురాలు కూడా అదే విమానంలో, అయితే వేరొక ప్యాసింజర్ నేమ్ రికార్డ్ (PNR) నంబర్‌పై ప్రయాణిస్తున్నట్లు అతడు అంగీకరించాడు.
దీంతో వెంటనే అప్రమత్తమైన డీఆర్ఐ బృందం విమానాశ్రయంలో ఆ మహిళపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. కొద్దిసేపట్లోనే ఆమెను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద ఉన్న ట్రాలీ బ్యాగ్‌ను తనిఖీ చేయగా, మొదటి ప్రయాణికుడి తరహాలోనే బట్టల నడుమ నల్లటి ప్లాస్టిక్ కవర్లో దాచి ఉంచిన 97,600 అమెరికన్ డాలర్లు లభ్యమయ్యాయి. దీని విలువ భారతీయ రూపాయిల్లో దాదాపు రూ. 91.94 లక్షలుగా ఉంది.
ఈ భారీ మొత్తంలో ఉన్న విదేశీ కరెన్సీని ఎక్కడి నుంచి సంపాదించారు…? దీనిని విదేశాలకు తీసుకువెళ్లడానికి తగిన చట్టబద్ధమైన ఆధారాలు లేదా అనుమతులు ఉన్నాయా? అని అధికారులు వారిని ప్రశ్నించారు. అయితే, ఆ విదేశీ ధనాన్ని చట్టబద్ధంగా పొందినట్లు గానీ, రవాణా చేయడానికి అనుమతి ఉన్నట్లు గానీ ఎలాంటి పత్రాలను ఆ ఇద్దరు ప్రయాణికులు చూపించలేకపోయారు. ఈ విదేశీ కరెన్సీ అక్రమ రవాణా నెట్వర్క్ వెనుక ఉన్న సూత్రధారులు ఎవరనే కోణంలో అధికారులు తదుపరి విచారణను వేగవంతం చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

