తెలంగాణలో ఎల్‌నినో ముప్పు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్-కమిటీ

ఎల్‌నినో ముప్పుపై సమీక్షించేందుకు తెలంగాణ సర్కార్ కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు చేసింది. దీనికి ఛైర్మన్‌గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యవహరించనున్నారు.

Published on: Oct 19, 2026, 18:47:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం.. తీవ్ర నీటి ఎద్దడి పరిస్థితులను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా సోమవారం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ నినో పరిణామాలను సమర్థవంతంగా అడ్డుకోవడానికి, తక్షణ చర్యలు చేపట్టేందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఛైర్మన్‌గా ఆరుగురు మంత్రులతో కూడిన అత్యున్నత స్థాయి సబ్-కమిటీని ఏర్పాటు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం

ఈ మంత్రివర్గ ఉప-కమిటీలో కీలక శాఖల మంత్రులకు చోటు కల్పించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవడం ఈ కమిటీ ప్రధాన విధి. వర్షపు నీటి సంరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ.. ఇంకుడు గుంతలు, చెరువులు, లీకేజీ కుంటల నిర్మాణం, వాటి నిర్వహణను పర్యవేక్షించనుంది.

ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్ నినో ప్రభావంపై మాట్లాడారు. రాష్ట్రంలోని రిజర్వాయర్లు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా బేసిన్‌లో నీటిమట్టాలు సాధారణం కంటే ఏకంగా 72 శాతం, గోదావరి బేసిన్‌లో 40 శాతం వరకు పడిపోయినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

నీటి లభ్యత లేకపోవడం వల్ల వేల ఎకరాల్లో సాగులో ఉన్న పంటలు ఎండిపోయే ప్రమాదం పొంచి ఉందని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విపత్తును ముందస్తుగా నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఇప్పటికే అధికారులను ఆదేశించారు.

ఎల్ నినో పరిస్థితులను ఎదుర్కొనే విధానంపై అన్ని రాజకీయ పార్టీల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు దసరా పండుగ తర్వాత ఒక అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. ప్రస్తుత సంక్షోభాన్ని అధిగమించడానికి ప్రభుత్వం దీర్ఘకాలిక, స్వల్పకాలిక ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. వర్షాభావ పరిస్థితులు, తాగునీరు, సాగునీటి రక్షణే లక్ష్యంగా ఈ సబ్-కమిటీ త్వరలోనే తన కార్యాచరణను ప్రారంభించనుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More