మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి 95 ఏళ్ల వయసులో సర్పంచ్ గా విజయం సాధించారు.సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని నాగారం గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా పోటీ చేశారు. హోరాహోరీగా జరిగిన పోరులో రామచంద్రారెడ్డి విక్టరీని అందుకున్నారు.

రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారంలో ఆయన కుమారుడు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చాలా చురుకుగా వ్యవహారించారు. మరోవైపు అధికార కాంగ్రెస్ లోని కీలక నేతలు… ఇక్కడ హస్తం పార్టీ బలపర్చిన అభ్యర్థిని గెలిపించేందుకు తీవ్రంగా శ్రమించారు. ఓ రకంగా ఇక్కడ బీఆర్ఎస్ ను ఓడించి… జగదీశ్ రెడ్డిని ఇరకాటంలోకి నెట్టాలని భావించారు. కానీ చివరగా రామచంద్రారెడ్డే విజయం సాధించటంతో… బీఆర్ఎస్ శ్రేణులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.
కేసీఆర్ అభినందనలు…
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసి, సర్పంచ్ గా గెలిచిన 95 ఏండ్ల గుంటకండ్ల రామచంద్రా రెడ్డిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభినందించారు. నిజానికి 95 సంవత్సరాల వయసులో ఉన్న రామచంద్రారెడ్డి పోటీలో ఉన్నారన్న విషయం తెలిసి కేసీఆర్ కొంత ఆశ్చర్యానికి కూడా లోనయ్యారు.
“100 ఏళ్లకు దగ్గరగా ఉన్న ఒక పెద్ద మనిషి నేటి యువతతో పోటీపడుతూ ప్రజాసేవకు ముందుకు రావడం అరుదు. ఎన్నికల బరిలో నిలవడం, ప్రజల ఆదరణ పొందుతూ గెలవడం… అనేది ప్రజాస్వామ్య ఎన్నికల విధానంలో చాలా అరుదైన విషయం” అని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
ఈ విజయంపై సంతోషం వ్యక్తం చేసిన కేసీఆర్… వారికి శుభాకాంక్షలు తెలిపారు. రామచంద్ర రెడ్డిని అభిమానంతో గెలిపించిన నాగారం గ్రామ ప్రజలను, మద్దతుగా నిలిచిన బి ఆర్ ఎస్ గ్రామ కార్యకర్తలను, నాయకులను కేసీఆర్ అభినందించారు. రామచంద్రారెడ్డి సంపూర్ణ ఆయురారోగ్యాలతో, నాగారం గ్రామ ప్రజలకు సుపరిపాలన అందించాలని కేసీఆర్ అభిలషించారు.