ఎమ్మెల్సీ రహమత్ బేగ్ మిస్సింగ్.. ఎంఐఎంలో తొలిసారి ధిక్కార స్వరం!

ఎంఐఎంలో మెుదటిసారి ధిక్కార స్వరం వినిపిస్తోంది. పార్టీ నుంచి ఎమ్మెల్సీ రహమత్ బేగ్‌ను బహిష్కరించడం, పదవికి రాజీనామా చేయాలని ఆదేశాలు వెళ్లాయి. అయితే ఇప్పటివరకు తన ఎమ్మెల్సీ పదవికి రహమత్ రాజీనామా చేయలేదు.

Published on: Aug 31, 2026, 15:32:13 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తెలంగాణ శాసనమండలి సభ్యుడు మీర్జా రహమత్ బేగ్ ఆగస్టు 29 హైదరాబాద్‌ చేరుకున్నారు. తర్వాత కనిపించకుండా పోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయనపై వచ్చిన తీవ్రమైన ఆరోపణలు, పార్టీ నుంచి బహిష్కరణ, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని పార్టీ ఆదేశాలు వచ్చాయి. దీంతో రాజీనామా చేయకూడదనే రహమత్ నిర్ణయం మధ్య ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఎమ్మెల్సీ రహమత్ బేగ్
ఎమ్మెల్సీ రహమత్ బేగ్

తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ రహమత్ బేగ్ తీవ్రంగా ఖండించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ఒక మైనర్ బాలికపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సోషల్ మీడియా వేదికగా వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై స్పందించిన బేగ్, ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు. తన ప్రతిష్టను దిగజార్చేందుకు సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ డీప్‌ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ చేసిన ఫోటోలను సృష్టించి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

ఈ విషయంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తనకు న్యాయం చేస్తారని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. పార్టీ నుంచి తీసివేసినప్పటికీ, తాను సాధారణ కార్యకర్తగా ఎంఐఎంలో కొనసాగేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, ఉమ్రా యాత్ర నిమిత్తం మక్కా వెళ్లానని బేగ్ స్పష్టం చేశారు. శనివారం నాడు ఆయన తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. అయితే హైదరాబాద్‌కు వచ్చిన కొద్దిసేపటికే ఆయన కనిపించకుండా పోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

క్రమశిక్షణా రాహిత్యం కింద రహమత్ బేగ్‌ను ఎంఐఎం పార్టీ నుంచి తక్షణమే బహిష్కరిస్తున్నట్లు ఆగస్టు 29న ఆ పార్టీ జాయింట్ సెక్రటరీ ఎస్.ఎ. హుస్సేన్ అన్వర్ ప్రకటించారు. అంతేకాకుండా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా లేఖను సమర్పించాలని ఆదేశించారు. అయితే బహిష్కరణకు కారణాలను ఎంఐఎం వెల్లడించలేదు. పార్టీ నిర్ణయానికి భిన్నంగా, తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయబోనని రహమత్ బేగ్ స్పష్టం చేశారు. ఇలాంటి నేపథ్యంలో ఎమ్మెల్సీ రహమత్ మిస్సింగ్ అవ్వడం కలకలం రేపుతోంది.

ఈ ఉదంతం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంపై సమగ్ర, పారదర్శక విచారణ జరిపించాలని ప్రతిపక్షాలైన బీఆర్‌ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్.వి. సుభాష్ మాట్లాడుతూ.. కేవలం పార్టీ నుంచి బహిష్కరించడం సరిపోదని, బేగ్‌పై వచ్చిన తీవ్రమైన ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని కోరారు. ప్రభుత్వం ఈ కేసులోని నిజానిజాలను బహిర్గతం చేయాలని, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయకుండా పార్టీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ రహమత్ మిస్సింగ్ కావడం సంచలనంగా మారింది.

దీనిపై ఇప్పటికే రహమత్ బేగ్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తన డీప్‌ఫేక్, మార్ఫింగ్ చేసిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని తెలిపారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More