...
...
Next Story

వివాహేతర సంబంధం.. కూతురును షాప్‌కు పంపి భర్తను చున్నీతో చంపిన భార్య

వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ఓ భార్య దారుణం చేసింది. చున్నీతో భర్తను హత్య చేసి.. ఆపై ఆత్మహత్యగా చూపించేందుకు ప్లాన్ చేసింది.

Published on: Jun 23, 2026, 14:22:29 IST
Advertisement

నమ్ముకున్న భర్త, కంటికి రెప్పలా చూసుకోవాల్సిన పిల్లలు, పచ్చని సంసారం.. వీటన్నింటికంటే ఓ పరాయి వ్యక్తితో ఏర్పడిన వివాహేతర బంధమే ఎక్కువనుకుంది ఓ మహిళ. క్షణిక సుఖాల కోసం కట్టుకున్నవాడిని కడతేర్చడమే కాకుండా, ఆ పాపాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆత్మహత్యగా నాటకమాడింది. కానీ చట్టం ముందు ఆమె నాటకాలు సాగలేదు. హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన ఈ ఘోర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఎల్బీనగర్‌లో భర్తను చంపిన భార్య
ఎల్బీనగర్‌లో భర్తను చంపిన భార్య

మహబూబాబాద్ జిల్లా కొరవి మండలం తట్టుపల్లి గ్రామానికి చెందిన బోడ నర్సింగ్ (36), స్వరూప దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చిన ఈ కుటుంబం.. ఎల్బీనగర్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్‌లో నివాసం ఉంటోంది. నర్సింగ్ కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న తరుణంలో స్వరూపకు తన సొంత ఊరికే చెందిన మోహన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది.

గత కొన్ని రోజులుగా భార్య ప్రవర్తనపై నర్సింగ్‌కు అనుమానం రావడంతో ఆమె బంధం గురించి అసలు నిజం తెలుసుకున్నాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ తీవ్రస్థాయిలో గొడవలు జరగడం ప్రారంభమైంది. తనకు భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన స్వరూప.. అతడిని ఎలాగైనా వదిలించుకోవాలని క్రూరమైన పథకం పన్నింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 20వ తేదీన స్వరూప తన పథకాన్ని అమలు చేసింది. ఇంట్లో భర్త ఉన్న సమయం చూసి, తన చిన్న కూతురిని ఏదో వస్తువు తీసుకురావాలని బయట ఉన్న దుకాణానికి పంపించింది. కూతురు బయటకు వెళ్లగానే, నర్సింగ్‌పై ఒక్కసారిగా దాడి చేసి తన ఒంటిపై ఉన్న చున్నీతో గొంతు నులిమి అత్యంత దారుణంగా హత్య చేసింది.

స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఎల్బీనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నర్సింగ్ మరణంపై అనుమానం రావడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదికలో నర్సింది ఆత్మహత్య కాదని, గొంతు నులమడం వల్లే ఊపిరాడక చనిపోయాడని వైద్యులు తేల్చి చెప్పారు.

వైద్యుల నివేదిక ఆధారంగా పోలీసులు స్వరూపను తమదైన శైలిలో విచారించగా, ఆమె చేసిన పాపాన్ని అంగీకరించింది. మోహన్‌తో ఉన్న బంధానికి అడ్డు వస్తున్నాడనే భర్తను చంపేసినట్లు విచారణలో ఒప్పుకుంది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ప్రియుడు మోహన్ పాత్రపై కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

విచ్చలవిడి బంధాలు ఎంతటి దారుణాలకు దారితీస్తాయో చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ. తల్లిదండ్రుల నీడలో హాయిగా పెరగాల్సిన ఇద్దరు ఆడపిల్లలు.. ఇప్పుడు తండ్రి ప్రాణాలు కోల్పోయి, తల్లి జైలు పాలవడంతో దిక్కులేని వారయ్యారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe