అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసిపోయి ఆందోళన చెందుతున్న తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఉపశమనం కలిగించింది. కొనుగోలు కేంద్రాలకు (ఐకేపీ సెంటర్లు) రైతులు తీసుకొచ్చే తడిసిన ధాన్యాన్ని సైతం నిబంధనల ప్రకారం పూర్తిగా కొనుగోలు చేస్తామని, అన్నదాతలు ఎలాంటి అపోహలు, ఆందోళనలు పెట్టుకోవద్దని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

ఇప్పటికే కురిసిన అకాల వర్షాల వల్ల తడిసిన సుమారు 9,214 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అత్యంత వేగంగా సేకరించి, బాయిల్డ్ రైస్ మిల్లులకు విజయవంతంగా తరలించినట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల తాజా పరిస్థితి, వర్షాల ప్రభావంపై ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర మంత్రివర్గ సహచరులు కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్, రవాణా శాఖల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడారు. 'రాష్ట్రంలో రైతులకు నష్టం కలిగించే ఏ చిన్న విషయాన్నైనా ప్రభుత్వం సహించబోదు. క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం.' అని పేర్కొన్నారు.
ప్రస్తుత రబీ (యాసంగి) సీజన్‌లో తెలంగాణ ప్రభుత్వం రికార్డు స్థాయిలో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కొనుగోలు కేంద్రాలకు 66.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చింది. వచ్చిన దాంట్లో 57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.
ఈ కొనుగోళ్ల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 8.15 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. కొనుగోలు చేసిన ధాన్యానికి గాను రైతుల ఖాతాల్లోకి రికార్డు స్థాయిలో రూ. 10,097 కోట్లను ప్రభుత్వం నేరుగా జమ చేసింది.
{{/usCountry}}ఈ కొనుగోళ్ల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 8.15 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. కొనుగోలు చేసిన ధాన్యానికి గాను రైతుల ఖాతాల్లోకి రికార్డు స్థాయిలో రూ. 10,097 కోట్లను ప్రభుత్వం నేరుగా జమ చేసింది.
{{/usCountry}}మొత్తం కొనుగోలు చేసిన 57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో.. సాధారణ రకం (దొడ్డు బియ్యం రకాలు): 44.67 లక్షల మెట్రిక్ టన్నులు, సన్న రకాలు 12.33 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్నాయి.
కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా, వర్షానికి తడిసిపోకుండా ఉండేందుకు ప్రభుత్వం రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసింది. ఇందులో భాగంగా ఇసుక రవాణా చేసే లారీలను తాత్కాలికంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు మళ్లించాలని రవాణా శాఖను ఆదేశించింది. ఈ లారీల ద్వారా కేంద్రాల నుండి రైస్ మిల్లులకు ధాన్యాన్ని వేగంగా తరలిస్తున్నారు. దీనివల్ల లోడింగ్, అన్‌లోడింగ్ సమస్యలు తగ్గుముఖం పట్టాయి.
రైతులకు పౌర సరఫరాల శాఖ ఇప్పటికే ముఖ్య సూచనలు చేసింది. ధాన్యంలో తేమ శాతం నిబంధనల ప్రకారం ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ అకాల వర్షానికి తడిస్తే, కేంద్రాల వద్ద ఉన్న టార్పాలిన్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలి. కొనుగోళ్లలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ప్రతి జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్లను లేదా స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించవచ్చు.
రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ, గన్ని బ్యాగుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. దళారులను నమ్మి తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకోవద్దని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ రైతులకు విజ్ఞప్తి చేశారు.