శంషాబాద్‌లో రణరంగం - బుల్లెట్ ట్రైన్ కోసం భూములు ఇచ్చేందుకు రైతుల నిరాకరణ, పోలీసులపై కారం పొడితో దాడి..!
శంషాబాద్‌లో హైడ్రా, రెవెన్యూ అధికారులు 650 ఎకరాల భూమికి కంచె వేయడాన్ని నిరసిస్తూ శనివారం రైతులు, రాజకీయ కార్యకర్తలు తీవ్ర నిరసనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులపై రాళ్లు, మిర్చి పొడి విసరడంతో చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్‌తో పాటు పలువురు పోలీసులు తృటిలో తప్పించుకున్నారు.
నగర శివార్లలోని శంషాబాద్ పరిధిలో శనివారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. హైడ్రా, రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్తంగా చేపట్టిన 650 ఎకరాల భూమి ఫెన్సింగ్ (కంచె వేసే) కార్యక్రమం రణరంగాన్ని తలపించింది. ప్రభుత్వ చర్యను నిరసిస్తూ స్థానిక రైతులు, మహిళలు మరియు రాజకీయ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ఈ క్రమంలో నిరసనకారులు హద్దులు దాటి పోలీసులపై రాళ్లు, మిర్చి పొడితో దాడికి తెగబడ్డారని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

డీసీపీపై కారం పొడితో దాడి
శనివారం ఉదయం నుంచే కంచె వేస్తున్న అధికారులను నిరసనకారులు అడ్డుకున్నారు. భద్రతా సిబ్బందితో నిరసనకారులు తీవ్ర ఘర్షణకు దిగారు. ఈ తోపులాటలో ఒక రైతు స్పృహతప్పి పడిపోవడంతో వాతావరణం మరింత వేడెక్కింది. ఆగ్రహించిన నిరసనకారులు, ముఖ్యంగా మహిళా నిరసనకారులు పోలీసులపైకి మిర్చి పొడి, రాళ్లు విసిరారు.
ఈ దాడిలో చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ ముఖం, కళ్లలో మిర్చి పొడి పడటంతో ఆయన వెంటనే నీటితో కడుక్కోవాల్సి వచ్చింది. ఇద్దరు పోలీసుల దుస్తులపై కూడా మిర్చి పొడి పడింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదని డీసీపీ స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన పలువురు రాజకీయ కార్యకర్తలను, నిరసనకారులను అదుపులోకి తీసుకున్నామని, అనంతరం వారిని విడుదల చేస్తామని ఆయన తెలిపారు.
మా జీవనోపాధిని దెబ్బతీయొద్దు: రైతుల ఆవేదన
ఈ భూములపై తమకు ఎలాంటి అధికారిక యాజమాన్య హక్కులు (పట్టాలు) లేవనే విషయాన్ని నిరసనకారులు అంగీకరించారు. అయితే, తాము దశాబ్దాలుగా ఈ భూమిని నమ్ముకుని సాగు చేసుకుంటున్నామని… తమ జీవనోపాధి మొత్తం దీనిపైనే ఆధారపడి ఉందని వారు పేర్కొన్నారు. తమ వద్ద ఉన్న భూమి సర్వే సంఖ్యలను చూపే ఒక మ్యాప్‌ను వారు ప్రదర్శించారు. అయితే అది ప్రభుత్వం గుర్తించని "ఆమోదించబడని మ్యాప్" అని అధికారులు తేల్చి చెప్పారు.
హైస్పీడ్ రైలు హబ్ కోసమే ఈ భూమి: అధికారులు
ఈ వివాదంపై రెవెన్యూ శాఖ అధికారి ఒకరు స్పందిస్తూ.. రికార్డుల ప్రకారం ఈ 650 ఎకరాల భూమి పూర్తిగా ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన హైదరాబాద్-పూణే, హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు హైస్పీడ్ రైళ్ల కారిడార్ కోసం శంషాబాద్ వద్ద ఒక భారీ హైస్పీడ్ రైలు కేంద్రాన్ని (High-Speed Rail Hub) ఏర్పాటు చేయనున్నారు.
ఈ హబ్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున భూమిని కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించారు. ఈ ప్రాజెక్టు నిమిత్తమే కబ్జాలు, అక్రమ నిర్మాణాలకు తావులేకుండా రెవెన్యూ, హైడ్రా విభాగాల ఆధ్వర్యంలో ఈ భూమికి రక్షణ కంచె వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

