కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం - బొమ్మల దుకాణాలు దగ్ధం..!

జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి సమీపంలో ఉన్న చిన్న దుకాణాల్లో శనివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు…దర్యాప్తు చేస్తున్నారు.

Published on: Nov 30, 2025, 11:51:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి సమీపంలో ఉన్న చిన్న దుకాణాల్లో శనివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగనప్పటికీ… ఆస్తి నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న వెంటనే 3 అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చినట్లు అగ్నిమాపక అధికారి తెలిపారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

మంటల్లో కాలిపోతున్న దుకాణాలు
మంటల్లో కాలిపోతున్న దుకాణాలు

భారీగానే ఆస్తి నష్టం…!

శనివారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించినట్లు స్థానికులు తెలిపారు.ఆలయ దిగువన ఉన్న శ్రీనాథ్‌ రెసిడెన్సీ సముదాయంలోని దాదాపు 20 దుకాణాల్లో ప్లాస్టిక్‌, ఆట బొమ్మలకు మంటలు అంటుకోవడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. కోటి రూపాయల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనతో భక్తులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

షార్ట్ సర్క్కూట్ తోనే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. అయితే ఇంకా ఏమైనా కారణాలున్నాయా అనే దానిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని దుకాణదారులు కోరుతున్నారు.

ఆర్థిక సాయం అందించండి - కేటీఆర్

జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అభయాంజనేయ స్వామి ఆలయ పరిసరాల్లో అర్ధరాత్రి జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు ఫోన్ చేసి మాట్లాడిన కేటీఆర్, క్షేత్రస్థాయిలో జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఉపాధి కోసం అప్పులు చేసి, ఎంతో కష్టపడి దుకాణాలు పెట్టుకున్న పేద, మధ్యతరగతి కుటుంబాలు ఈ ప్రమాదంతో ఒక్కసారిగా రోడ్డున పడ్డాయని కేటీఆర్ ఆవేదన చెందారు. షాపుల్లో ఉన్న సరుకు, బొమ్మలు, ఇతర సామాగ్రి సర్వం అగ్నికి ఆహుతయ్యాయని, దాదాపు 30 కుటుంబాల భవిష్యత్తు నాశనం అయిందని విచారం వ్యక్తం చేశారు. సుమారు కోటి రూపాయల వరకు ఆస్తి నష్టం జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు.

సకాలంలో ఫైర్ ఇంజన్లు రాకపోవడమే ఆస్తి నష్టం ఇంత భారీగా పెరగడానికి ప్రధాన కారణమని కేటీఆర్ మండిపడ్డారు. జగిత్యాల ఫైర్ ఇంజన్ రిపేర్‌లో ఉండటం, వచ్చిన ఒక ఇంజన్ పని చేయకపోవడం, గంట తర్వాత కోరుట్ల, కరీంనగర్ నుంచి వాహనాలు రావడం ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యానికి, నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ఈ వైఫల్యానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

సర్వం కోల్పోయిన ఈ కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. జరిగిన ఆస్తి నష్టం, పూర్తిగా దెబ్బతిన్న వ్యాపారాన్ని, దుకాణాలు ఏమాత్రం పనికిరాని స్థితికి చేరడాన్ని దృష్టిలో ఉంచుకొని….. మానవతా దృక్పథంతో ఒక్కో కుటుంబానికి రూ. 30 లక్షల ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రమాదం విషయం తెలియగానే అక్కడికి చేరుకుని, సహాయక చర్యల్లో పాల్గొని, బాధితులకు తక్షణ సాయంగా రూ. 5000 అందజేసిన మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను కేటీఆర్ అభినందించారు. స్థానికులకు, నష్టపోయిన కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోకుంటే, పార్టీ తరఫున ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని కేటీఆర్ హెచ్చరించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More