మెట్రో టేకోవర్, జంపన్న వాగులో నిరంతరం నీరు.. మేడారంలో కేబినెట్ సమావేశం నిర్ణయాలు

వీలైనంత తొందరగా మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరిలో పండుగలు ఉన్నందున ఎన్నికల ప్రక్రియకు ఇబ్బంది లేకుండా షెడ్యూల్ రూపొందించుకోవాలని అధికారులకు కేబినెట్ సూచించింది.

Published on: Jan 19, 2026, 09:15:44 IST
By , Medaram
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

చరిత్రలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ వెలుపల మేడారం సమ్మక్క–సారలమ్మ సన్నిధిలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మేడారంలో జరిగిన ఈ మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కేబినెట్.

మేడారంలో కేబినెట్ సమావేశం
మేడారంలో కేబినెట్ సమావేశం

కేబినెట్ నిర్ణయాలు

  • పదవీకాలం పూర్తయిన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు వీలైనంత తొందరగా ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడద్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం నిర్ణయించింది. రాష్ట్రంలో గడువు పూర్తయిన 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు, వాటి పరిధిలోని 2,996 వార్డులు, డివిజన్లకు సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని సమావేశం తీర్మానించింది.
  • మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి డెడికేషన్ కమిషన్ ఇప్పటికే నివేదిక సమర్పించడం, రిజర్వేషన్లు కూడా ఖరారవడం, అలాగే ఫిబ్రవరిలో రంజాన్, శివరాత్రి పండుగలతో పాటు చివరి వారం నుంచి వివిధ స్థాయిల్లో విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సాధ్యమైనంత తొందరగా ఎన్నికలు పూర్తి చేయాలని మంత్రిమండలి భావించింది.
  • మేడారం జంపన్న వాగులో నిరంతరం నీరు ఉండే విధంగా రామప్ప, లక్నవరం నుంచి గోదావరి నీటిని ఎత్తిపోతల ద్వారా తరలించేందుకు సంబంధించి రూ. 143 కోట్లు మంజూరు చేసింది.
  • ములుగు జిల్లాలో కొత్తగా పొట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను కేబినెట్ ఆమోదించింది. రామప్ప చెరువు నుంచి నీటిని లిఫ్ట్ చేసి ములుగు జిల్లాలోని 5 గ్రామాలు, 30 చెర్వులు కుంటలను నింపడంతో పాటు.. 7500 ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించనుంది.
  • మేడారం పుణ్యక్షేత్రం కోసం ఇప్పటికే 19 ఎకరాల భూ సేకరణ పూర్తి కాగా, మరో 20 లేదా 21 ఎకరాల భూమిని సేకరించి భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయాలని మంత్రిమండలి తీర్మానించింది.
  • 2027 జూలై 27 నుంచి ఆగస్టు 3 వరకు జరగనున్న గోదావరి పుష్కరాలను సమగ్ర ప్రణాళికతో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరీవాహక ప్రాంతంలోని పురాతన ప్రసిద్ధ దేవాలయాలను ఒక సర్క్యూట్ కింద ఆలయాల అభివృద్ధి, ఎకో-టూరిజం దృష్టితో నివేదిక అందించేందుకు ఒక కన్సల్టెన్సీని నియమించాలని నిర్ణయించారు.
  • మార్చి 31 నాటికి కన్సల్టెన్సీ అందించే నివేదికపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి, మేడారంలో చేపట్టిన తరహాలోనే దేవాలయాలను శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేసి, పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని మంత్రిమండలి తీర్మానించింది.
  • ఎల్అండ్‌టీ సంస్థ నుంచి హైదరాబాద్ మెట్రో టేకోవర్ అంశంపై సమగ్రంగా చర్చించిన మంత్రిమండలి ఆ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఈలోగా మెట్రో ఫేజ్-2లో భాగంగా ఏ, బీ విస్తరణలకు సంబంధించిన భూసేకరణను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని, అందుకు రూ. 2,787 కోట్లను కేటాయిస్తూ కేబినేట్ ఆమోదముద్ర వేసింది.
  • హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి శిల్పా లే-అవుట్ వరకు సుమారు 9 కి.మీ. మేరకు కొత్త రోడ్డు నిర్మాణానికి కూడా ఆమోదం తెలిపింది.
  • నల్గొండ జిల్లా మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ పరిధిలో లా కాలేజీ ఏర్పాటు చేయడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

ప్రతినిత్యం భక్తులు సందర్శించేలా చేస్తాం : రేవంత్ రెడ్డి

మేడారంలో జరిగిన మంత్రిమండలి సమావేశం అనంతరం నిర్వహించిన ఉత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆదివాసీ సోదర సోదరీమణులందరికీ సమ్మక్క - సారలమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేశారు. నిరంతరం భక్తులు, పర్యాటకులు సందర్శించే విధంగా మేడారం ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. దివాసీ వీరవనితలు సమ్మక్క, సారలమ్మలు కొలువైన మేడారం పుణ్యక్షేత్రం.. జంపన్న వాగులో నిరంతరం నీరు ప్రవహించే విధంగా రామప్ప - లక్నవరం నుంచి పైప్‌లైన్ ద్వారా నీటిని తరలిస్తామని ప్రకటించారు.

ఈ పుణ్యక్షేత్రాన్ని తిరుమల-తిరుపతి, కుంభమేళాలను తలపించేలా ప్రతినిత్యం భక్తులు సందర్శించే విధంగా మేడారం ఆలయ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

'ధీరత్వమే దైవత్వంగా మారిన చారిత్రక సత్యం మేడారం మహోత్సవం. గుడి లేని తల్లులను గుండెనిండా నింపుకొని జరుపుకొనే అతిపెద్ద మేడారం జాతర కోసం చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తిగా సంతృప్తినిచ్చాయి. 2023 ఫిబ్రవరి 6వ తేదీన ఈ ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే విధంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం సమ్మక్క, సారలమ్మ ఆలయాన్ని కుంభమేళాను తలపించే విధంగా, ఆదివాసీలనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకర్షించేలా తీర్చిదిద్దాం. జాతర ప్రారంభమయ్యే జనవరి 28 నాటికి పనులు పూర్తి చేయాలని చెప్పాను.' అని రేవంత్ రెడ్డి అన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More