అస్సాంలో శ్రీవారి ఆలయ నిర్మాణం - 25 ఎకరాల భూమి కేటాయిస్తూ ఆదేశాలు
గువాహటిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి అస్సాం ప్రభుత్వం 25 ఎకరాల భూమి కేటాయింపులు చేసింది. అస్సాం, ఏపీ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిన సంప్రదింపుల అనంతరం ఈ కీలక నిర్ణయం వెలువడింది.
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామివారి వైభవాన్ని ఈశాన్య భారతదేశంలో మరింత విస్తరించే దిశగా కీలక ముందడుగు పడింది. గువాహటి నగరంలో శ్రీ వేంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం నిర్మాణానికి తొలుత నిర్ణయించిన 10.8 ఎకరాల భూమికి బదులుగా 25 ఎకరాల భూమిని కేటాయించేందుకు అస్సాం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అస్సాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిన సంప్రదింపుల అనంతరం ఈ కీలక నిర్ణయం వెలువడింది.

టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు తెలిపిన వివరాల ప్రకారం గువాహటి సమీపంలోని కామ్రూప్ మెట్రోపాలిటన్ జిల్లాలో 10.8 ఎకరాల భూమిని కేటాయించేందుకు అస్సాం ప్రభుత్వం గతంలోనే అంగీకారం తెలిపింది. అయితే డిసెంబర్ 7న అస్సాం ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి కేకే ద్వివేది టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు లేఖ రాస్తూ గువాహటిలోని గర్చుక్ ప్రాంతంలో ఇప్పటికే ఉన్న శ్రీవారి ఆలయం మరియు సాంస్కృతిక సముదాయం నిర్వాహకుల సూచనలను చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. కామ్రూప్ మెట్రోపాలిటన్ జిల్లాలో టీటీడీ శ్రీ వేంకటేశ్వర ఆలయం నిర్మిస్తే, అక్కడ ఉన్న ఆలయ ప్రయోజనాలకు భంగం కలగవచ్చని వారు అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో శ్రీ వేంకటేశ్వర ఆలయాన్ని అస్సాంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న సిల్చార్ లేదా డిబ్రూగఢ్ నగరాల్లో ఏర్పాటు చేయాలని అస్సాం సీఎం అదనపు ప్రధాన కార్యదర్శి సూచించారు. ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లగా…. ఆయన డిసెంబర్ 18న అస్సాం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిశ్వ శర్మకు లేఖ రాశారు.
దేశంలోని ప్రతి రాష్ట్రం మరియు కేంద్రపాలిత ప్రాంతంలో కనీసం ఒక శ్రీ వేంకటేశ్వర ఆలయాన్ని స్థాపించడం ద్వారా హిందూ సనాతన ధర్మం, శ్రీ వేంకటేశ్వర స్వామివారి మహిమను విస్తరించాలన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు టీటీడీ యొక్క నిబద్ధతగా ఆ లేఖలో పేర్కొన్నారు.
25 ఎకరాల భూమి కేటాయింపు…
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతిలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 25 ఎకరాల భూమిని కేటాయించిన విషయాన్ని అస్సాం ముఖ్యమంత్రికి గుర్తు చేస్తూ, సిల్చార్ లేదా డిబ్రూగఢ్ బదులుగా అస్సాం రాజధాని గువాహటిలోనే టీటీడీకి 25 ఎకరాల భూమి కేటాయించాలని ఏపీ సీఎం కోరారు. ఈశాన్య భారతదేశానికి గువాహటి ప్రధాన కేంద్రంగా ఉన్నందున, భక్తుల సౌకర్యాలు, నిత్య అన్నదానం వంటి ధార్మిక కార్యక్రమాలతో కూడిన దివ్యక్షేత్రాన్ని ఏర్పాటు చేయడానికి సుమారు 25 ఎకరాల భూమిని కేటాయించాలని సిఫార్సు చేశారు. అలాగే ప్రతిపాదిత స్థలంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు అస్సాం ప్రభుత్వం ఆర్థిక సహకారం కూడా అందించాలని ఏపీ సీఎం తన లేఖలో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసిన సూచనలకు సానుకూలంగా స్పందించిన అస్సాం ముఖ్యమంత్రి గువాహటిలోనే టీటీడీకి 25 ఎకరాల భూమిని కేటాయించేందుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. అలాగే ప్రతిపాదిత ప్రాజెక్టు అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని కూడా అందించేందుకు అంగీకరించారు.
ఈ అంశాన్ని సౌహార్దపూర్వకంగా పరిష్కరించినందుకు ఆంధ్రప్రదేశ్ మరియు అస్సాం రాష్ట్రాల ముఖ్యమంత్రులకు టీటీడీ చైర్మన్ బీ.ఆర్ నాయుడు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. భూమి కేటాయింపునకు సంబంధించిన విధివిధానాలను పూర్తి చేసి, ఈశాన్య భారతదేశంలో తొలి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభించేందుకు అస్సాం ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటామని చైర్మన్ బీ.ఆర్.నాయుడు తెలియజేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

