కొండగట్టు అంజన్న నిధులు గోల్‌మాల్.. ఒకరు డిస్మిస్.. ముగ్గురు అధికారుల ఇంక్రిమెంట్లు కట్

కొండగట్టు అంజన్న నిధులు గోల్‌మాల్ అయ్యాయి. దీంతో నలుగురు అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఈ విషయాన్ని దేవాదాయ శాఖ అంతర్గత ఆడిట్‌లో గుర్తించి విచారణకు ఆదేశించింది.

Published on: Aug 14, 2026, 10:54:40 IST
By , Kondagattu
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జగిత్యాల జిల్లాలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో భారీగా నిధులు పక్కదారి పట్టిన వ్యవహారంలో దేవాదాయ శాఖ అధికారులు తీవ్ర చర్యలు తీసుకున్నారు. ఆలయ నిధుల దుర్వినియోగంపై సాగిన విచారణ అనంతరం మొత్తం నలుగురు ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు చేపట్టినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఇందులో ఒక ప్రధాన నిందితుడిని ఉద్యోగం నుంచి డిస్మిస్, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు సూపర్‌వైజరీ స్థాయి అధికారులకు వార్షిక ఇంక్రిమెంట్లు నిలిపివేస్తూ జరిమానా విధించారు.

కొండగట్టు
కొండగట్టు

ఆలయ నిధుల మళ్లింపులో ప్రధాన పాత్ర పోషించిన సీనియర్ అసిస్టెంట్ కె. శ్రీనివాసాచారిని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ ఈవో ఎస్. అంజనా రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాసాచారి ఇప్పటికే సస్పెన్షన్‌లో ఉన్నారు. ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, మొత్తం 12 రకాల తీవ్రమైన ఆరోపణలతో చార్జ్‌షీట్ నమోదు చేశారు. శాఖాపరమైన సమగ్ర విచారణలో ఆయనపై వచ్చిన అన్ని ఆరోపణలు రుజువయ్యాయి. కొండగట్టు దేవస్థానానికి చెందిన రూ. 49.29 లక్షల నిధులను ఆయన దుర్వినియోగానికి పాల్పడినట్లు విచారణలో స్పష్టంగా తేలింది.

కింది స్థాయి సిబ్బంది నిధుల దుర్వినియోగానికి పాల్పడుతుంటే పర్యవేక్షించడంలో, రికార్డులను సరిచూడడంలో ఘోరంగా విఫలమైనందుకు ముగ్గురు సూపర్‌వైజరీ స్థాయి అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. వీరికి శిక్షగా రెండు వార్షిక ఇంక్రిమెంట్లను నిలిపివేస్తూ ఇఓ ఆదేశాలు ఇచ్చారు.

కొండగట్టు ఆలయ మాజీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ప్రస్తుతం కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్నారు. ఆలయ రికార్డులను సరిచూడడంలో, కింది సిబ్బందిని పర్యవేక్షించడంలో నిర్లక్ష్యం వహించినందుకు ఈయన రెండు ఇంక్రిమెంట్లను నిలిపివేశారు.

జి. శ్రీనివాస్ శర్మ ఆలయ మాజీ సూపరింటెండెంట్‌గా పనిచేసిన ఈయన, కింది స్థాయి సిబ్బందిని సరిగ్గా మానిటరింగ్ చేయకపోవడం వల్ల ఆర్థిక అక్రమాలకు తావు ఇచ్చినట్లయిందని భావించి రెండు ఇంక్రిమెంట్ల కోత విధించారు.

మరో సూపరింటెండెంట్ సునీల్ కుమార్ కూడా సిబ్బంది పర్యవేక్షణ, ఆలయ రికార్డుల తనిఖీల్లో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు విచారణలో తేలడంతో ఆయన రెండు ఇంక్రిమెంట్లను నిలిపివేస్తూ ఈఓ ఉత్తర్వులు ఇచ్చారు.

మొత్తం విచారణ ప్రక్రియలో ప్రస్తుత అంశానికి సంబంధించి రూ. 14.49 లక్షల నిధుల పక్కదారి పట్టగా, శ్రీనివాసాచారిపై జరిగిన చర్యల ద్వారా మొత్తం రూ. 49.29 లక్షల మేర నిధుల అక్రమార్జన, దుర్వినియోగం జరిగినట్లు దేవాదాయ శాఖ విచారణలో అధికారికంగా నిర్ధారణ అయ్యింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే కింది స్థాయి సిబ్బందికి ఈ అవకతవకలకు పాల్పడే వెసులుబాటు లభించిందని అధికారులు స్పష్టం చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More