జై బోలో హనుమాన్‌కి.. చిన్న జయంతి వేడుకలకు కొండగట్టు సిద్ధం.. భారీగా భక్తులు!

Hanuman Chinna Jayanthi : హనుమాన్ చిన్న జయంతి వేడుకలకు కొండగట్టు అంజన్న ఆలయం సిద్ధమైంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

Published on: Mar 31, 2026, 15:51:18 IST
By , Kondagattu
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలోని జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్నస్వామి ఆలయం హనుమాన్ చిన్న జయంతి వేడుకలకు సిద్ధమైంది. ఏప్రిల్ 1 నుంచి 3 వరకు కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో మూడు రోజుల పాటు హనుమాన్ చిన్న జయంతి వేడుకలు నిర్వహిస్తారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ల నుండి సుమారు మూడు లక్షల మంది భక్తులు పాల్గొనే ఈ వేడుకల కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు.

కొండగట్టు
కొండగట్టు

హనుమాన్ దీక్ష తీసుకున్న భక్తులు తమ దీక్షను ముగించుకోవడానికి ఆలయాన్ని సందర్శిస్తారు. వారిలో కొందరు అప్పటికే ఆలయానికి చేరుకోగా, చాలామంది వివిధ ప్రాంతాల నుండి కాలినడన బయలుదేరారు. ఆలయం వద్ద భారీ రద్దీ ఉంటుందని అంచనా వేస్తున్నందున.. ఆలయ అధికారులు మూడు రోజుల పాటు అన్ని 'అర్జిత సేవలను' రద్దు చేయాలని నిర్ణయించారు. భక్తుల సౌకర్యార్థం 50,000 లడ్డూలు, పులిహోర తదితర ప్రసాదాలను అదనంగా సిద్ధం చేశారు.

వివిధ ప్రదేశాలలో తాగునీటి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు, తాత్కాలిక పందిళ్ళు, స్వాగత తోరణాలు, ప్రత్యేక క్యూ లైన్లు, పార్కింగ్ స్థలాలు, తాత్కాలిక మరుగుదొడ్లు, ఇతర ఏర్పాట్లు చేశారు. యాత్రికులకు చికిత్స అందించేందుకు వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు.

జాతరను శాంతియుతంగా నిర్వహించేందుకు, పోలీసులు అదనపు బలగాలను మోహరించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఉన్న వాటికి అదనంగా మరిన్ని సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు.

పార్కింగ్ స్థలంతోపాటుగా నీటి వసతి, మరుగుదొడ్లు వంటి సదుపాయాలు ఏర్పాట్లు సరిగా చూసుకోవాలని కలెక్టర్‌ బి.సత్యప్రసాద్‌ ఆదేశాలు ఇచ్చారు. వైద్య శిబిరాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, 108 అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచాలన్నారు. 24 గంటలు అంతరాయం లేకుండా సేవలు కొనసాగాలన్నారు. హనుమాన్ దీక్ష వేసుకున్నవారి కోసం వేములవాడ, జగిత్యాల, కరీంనగర్‌ నుంచి ప్రత్యేక బస్సులు నడిపించనున్నట్లు తెలిపారు.

కొండగట్టు అంజన్నను దర్శించుకున్న తర్వాత చాలా మంది భక్తులు వేములవాడ రాజన్న దర్శనానికి వెళ్తుంటారు. కొండగట్టు నుంచి వేములవాడ వెళ్లేదారి బిజీబిజీగా ఉండనుంది.

హనుమాన్ భక్తులతో శునకం పాదయాత్ర

కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి ఓ శునకం చేరుకుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి చేరుకోవడానికి సుమారు 130 కిలోమీటర్ల దూరం నడిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూరుకు చెందిన హనుమాన్ దీక్షా స్వాముల బృందం కొండగట్టు ఆలయానికి పాదయాత్రగా బయలుదేరారు. ఉట్నూరులో విశ్రాంతి తీసుకుంటుండగా కుక్క వారి వద్దకు వచ్చింది. హనుమాన్ దీక్షా స్వాములలో ఒకరు దానికి బిస్కెట్ ఇవ్వడంతో అది వారితోనే నడవడం ప్రారంభించింది.

ఆ శునకాన్ని పంపించడానికి ప్రయత్నించినప్పటికీ, హనుమాన్ దీక్షా స్వాములతోపాటే నడవడం కొనసాగించింది. హనుమాన్ దీక్షా స్వాములు కుక్క ఇబ్బంది పడకుండా కాళ్లకు వస్త్రాలు కట్టారు. కుక్క స్వాములకు రక్షణగా ఉండటంతో రాత్రిపూట ఎలాంటి భయం లేకుండా 20 కిలోమీటర్ల అటవీ ప్రాంతంలో నడిచారు. చివరకు ఆ శునకం 130 కిలోమీటర్లు నడిచి కొండగట్టు పుణ్యక్షేత్రానికి చేరుకుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More