గ్రూప్‌ 3 సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ వెళ్తున్నారా? ఈ పత్రాలు తీసుకెళ్లడం మరిచిపోవద్దు!

తెలంగాణలో గ్రూప్ 3 సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ మెుదలైంది. అభ్యర్థులు వెరిఫికేషన్‌కు వెళ్లేముందు తీసుకెళ్లాల్సిన సర్టిఫికెట్లను గుర్తుపెట్టుకోవాలి. వెళ్లిన తర్వాత ఇబ్బందులు పడొద్దు.

Published on: Nov 10, 2025, 11:17:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్‌ నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో గ్రూప్ 3 సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ప్రారంభమైంది. గ్రూప్ 3 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాలను టీజీపీఎస్సీ పరిశీలిస్తోంది. ఈ ప్రక్రియ నవంబర్ 26వ తేదీ వరకు నడుస్తుంది. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరిశీలన ఉంటుంది. ఈ మేరకు టీజీపీఎస్సీ వివరాలు వెల్లడించింది.

టీజీపీఎస్సీ గ్రూప్ 3 సర్టిఫికెట్ వెరిఫికేషన్
టీజీపీఎస్సీ గ్రూప్ 3 సర్టిఫికెట్ వెరిఫికేషన్

సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఎంపికైన అభ్యర్థుల హాల్ టికెట్ నెంబర్లు ఇప్పటికే www.tgpsc.gov.in లో ఉన్నాయి. డౌట్ ఉంటే ఓసారి చెక్ చేసుకోండి. ధ్రువపత్రాల పరిశీలనకు వచ్చే అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తోపాటుగా రెండు జిరాక్స్ సెట్లు కూడా తెచ్చుకోవాలి. అంతకుముందు మీ వెరిఫికేషన్ ఎప్పుడు ఉందో అధికారిక వెబ్‌సైట్‌లో షెడ్యూల్ చూసుకోవాలి. దాని ప్రకారమే వెరిఫికేషన్ కేంద్రానికి హాజరు కావాల్సి ఉంటుంది.

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. టీజీపీఎస్సీ చెప్పిన తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం హాజరు అవ్వని అభ్యర్థుల అభ్యర్థిత్వం తదుపరి ప్రక్రియకు పరిగణించరు. వెరిపికేషన్‌కు హాజరైన వారికి సంబంధించిన పెండింగ్ ఉన్న పత్రాలు నవంబర్ 29 సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలి. ఆ తర్వాత అస్సలు అంగీకరించరు.

అభ్యర్థులు వెరిఫికేషన్ కేంద్రానికి తీసుకెళ్లాల్సిన పత్రాలు ఏమేం ఉన్నాయో చూద్దాం.. ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతోపాటుగా వాటి రెండు జిరాక్స్ సెట్లు, సంతకం చేసిన ఫొటో కాపీలు తీసుకెళ్లాలి. హాల్‌టికెట్, అప్లికేషన్ ఫామ్ 2 కాపీలు వెబ్‌సైట్‌లో ఉన్నాయి. ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, సర్వీస్ ఐడీ కార్డుల్లో ఏదో ఒకటి తేవాలి.

డేట్ ఆఫ్ బర్త్ కోసం పదో తరగతి, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ మెమో ఏదో ఒకటి ఉండాలి. విద్యార్హతలకు సంబంధించి.. ఒరిజినల్ మెమోలు, సర్టిఫికెట్సు తీసుకురావాలి. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్, నివాస ధ్రువీకరణ పత్రం ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికెట్, దివ్యాంగ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల సంబంధిత సర్టిఫికెట్స్, స్పోర్ట్స్ రిజర్వేషన్ ఉంటే ఆ పత్రాలు, ఫీజు మినహాయింపు పత్రాలు వెంట తెచ్చుకోవాలి.

1365 గ్రూప్ 3 పోస్టులకు టీజీపీఎస్సీ నియామకం చేపట్టింది. నవంబర్ 17, 18వ తేదీల్లో రాత పరీక్షలు జరిగాయి. మెుత్తం 2.67 లక్షల మంది హాజరు అయ్యారు. పరీక్షల జనరల్ ర్యాంకింగ్ లిస్టు మార్చి 14న విడుదలైంది. ఇటీవల మెరిట్ జాబితా విడుదల చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More