Telangana Gurukul Diet Charges : రాష్ట్రంలోని ప్రభుత్వ గురుకులాలు, నివాస వసతి గృహ పాఠశాలల నిర్వహణకు ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం లభించింది. సామాజికంగా వెనుకబడిన, బలహీన వర్గాల విద్యార్థులకు మెరుగైన వసతులు, నాణ్యమైన విద్యా వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), వెనుకబడిన తరగతులు (BC), మైనారిటీ సంక్షేమం, విద్యా శాఖల పరిధిలోని నివాస విద్యాసంస్థలకు సంబంధించిన ఆహార వ్యయాలు (డైట్ చార్జీలు), కాస్మెటిక్స్ ఖర్చులు, భవన అద్దెలను ఇకపై ప్రతి నెలా సకాలంలో విడుదల చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఇకపై నెలవారీ చెల్లింపులు

గత ప్రభుత్వాల కాలంలో ఈ నిధుల చెల్లింపుల్లో తీవ్ర ఆలస్యం జరిగేది. దాదాపు 8 నుంచి 9 నెలల వరకు నిధులు రాకపోవడం వల్ల నివాస పాఠశాలలు, హాస్టళ్ల నిర్వహణ భారంగా మారడమే కాకుండా విద్యార్థుల భోజన వసతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి.
ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. విద్యార్థుల కష్టాలను ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని…. మొదట త్రైమాసిక (మూడు నెలలకోసారి) చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఆ విధానాన్ని మరింత సరళీకృతం చేస్తూ నేరుగా ప్రతి నెలా నిధులు ఇచ్చేలా 'నెలవారీ చెల్లింపుల విధానాన్ని' అమల్లోకి తెచ్చారు.
2026-27 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలోనే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ కీలక మార్పును అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. చెప్పినట్లుగానే ఇప్పుడు నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సరికొత్త నిర్ణయం వల్ల విద్యార్థులకు నిరంతరాయంగా, ఎలాంటి అడ్డంకులు లేకుండా పోషకాహారం అందుతుంది. హాస్టళ్ల సక్రమ నిర్వహణతో పాటు ప్రైవేట్ భవనాల్లో నడుస్తున్న పాఠశాలల అద్దెల చెల్లింపులు కూడా సాఫీగా సాగనున్నాయి. ఇది విద్యార్థుల విద్యా ఫలితాలను పెంచడానికి, పాఠశాలల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మెరుగుపరచడానికి ఎంతగానో దోహదపడుతుంది.
నిధులు విడుదల…
నెలవారీ చెల్లింపుల నిర్ణయాన్ని అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం…. రూ. 221.24 కోట్ల నిధులను తక్షణమే విడుదల చేసింది. ఈ భారీ నిధుల విడుదల ద్వారా వసతి గృహ పాఠశాలల్లోని విద్యార్థుల పోషణ, సంక్షేమం, వసతి సదుపాయాలకు పూర్తి స్థాయిలో నిరంతర మద్దతు లభించనుంది.
{{/usCountry}}నెలవారీ చెల్లింపుల నిర్ణయాన్ని అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం…. రూ. 221.24 కోట్ల నిధులను తక్షణమే విడుదల చేసింది. ఈ భారీ నిధుల విడుదల ద్వారా వసతి గృహ పాఠశాలల్లోని విద్యార్థుల పోషణ, సంక్షేమం, వసతి సదుపాయాలకు పూర్తి స్థాయిలో నిరంతర మద్దతు లభించనుంది.
{{/usCountry}}“అణగారిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన నివాస సదుపాయాలు కల్పించేందుకు మా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, సాధికారత సాధించడమే కాకుండా, వారిని సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం” అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు, గురుకులాల సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.