ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ సెక్యూరిటీ, వ్యవసాయం.. తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి

సీఎం రేవంత్ రెడ్డితో గూగుల్ ఏపీఏసీ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా సమావేశమయ్యారు. ట్రాఫిక్, సైబర్ సెక్యూరిటీ, స్టార్టప్‌లు, వ్యవసాయం, క్లైమేట్ చేంజ్ రంగాల్లో భాగస్వామ్యంతో పని చేస్తామని చెప్పారు.

Updated on: Jan 20, 2026, 20:02:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ వివిధ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ఆసక్తి చూపించింది. వ్యవసాయం, వాతావరణ మార్పు, పట్టణ కాలుష్య సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకుంటామని వెల్లడించింది. ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ సెక్యూరిటీ, వ్యవసాయం, స్టార్టప్‌లలో భాగస్వామ్యం పంచుకునేందుకు గూగుల్ ఆసక్తిగా ఉంది.

దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు
దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు

దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో సీఎం రేవంత్ రెడ్డి గూగుల్ ఆసియా పసిఫిక్ ఏరియా(ఏపీఏసీ) ప్రెసిడెంట్ సంజయ్ గుప్తాతో భేటీ అయ్యారు. ప్రధానంగా వాతావరణంలో పెను మార్పులు, వ్యవసాయంపై దాని ప్రభావం, పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న కాలుష్యం వంటి సమస్యల పరిష్కారాలపై సమగ్రంగా చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రాంతీయ ఆర్థిక వృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న క్యూర్, ప్యూర్, రేర్ అభివృద్ధి నమూనాను వివరించారు. కోర్ హైదరాబాద్‌ సిటీని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దే ప్రణాళికలను వివరించారు. ట్రాఫిక్ కంట్రోల్, సైబర్ సెక్యూరిటీ, స్టార్టప్ ఇన్నోవేషన్‌కు మరింత మద్దతు వంటి రంగాల్లో పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి ప్రస్తావించారు.

తొలి గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్​ను హైదరాబాద్​లో ఏర్పాటు చేసినందుకు గూగుల్ బృందానికి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. వ్యవసాయ రంగంలో ఎరువుల అతిగా వినియోగం వల్ల ఏర్పడుతున్న సమస్యలు, రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరంపై ఈ సమావేశంలో ప్రతినిధుల బృందం చర్చలు చేసింది. సమస్యల పరిష్కారానికి, సమస్యలు తలెత్తకుండా నివారించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ సెక్యూరిటీ, వ్యవసాయం, స్టార్టప్‌లు, వాతావరణ మార్పు అంశాల్లో తెలంగాణకు పూర్తి స్థాయిలో మద్దతు అందించేందుకు గూగుల్ సిద్ధంగా ఉందని గూగుల్ ఏపీఏసీ ప్రెసిడెంట్ శ్రీ సంజయ్ గుప్తా తెలిపారు.

మెుత్తానికి ప్రపంచ ఆర్థిక సదస్సు వేదిక దావోస్‌లో తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం మొదటి రోజున బిజీబిజీగా గడిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ ఛైర్మన్ అలోన్ స్టోపెల్ గారు భేటీ అయ్యారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

వ్యవసాయం, వాతావరణ మార్పులకు సంబంధించిన ఇన్నోవేషన్ స్టార్టప్‌లకు సహకారాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్‌టెక్ ఇన్నోవేషన్‌తో పాటు హెల్త్‌టెక్, అగ్రి-టెక్, సైబర్ సెక్యూరిటీ, ఏరోస్పేస్ వంటి సాంకేతిక రంగాల్లో తెలంగాణ స్టార్టప్‌లకు ఇజ్రాయెల్ మద్దతు ఇవ్వడంతో పాటు భాగస్వామ్యాన్ని పంచుకుంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహా పలు రంగాల్లో ఇజ్రాయెల్‌ స్టార్టప్‌లతో కలిసి తెలంగాణ పైలట్ ప్రోగ్రామ్‌లను ప్రారంభించనుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More