కొత్త జిల్లాను ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వ పరిశీలనలో లేదు : సీఎం రేవంత్ రెడ్డి
కొన్ని జిల్లాలను రద్దు చేస్తారని, సింగరేణి మెడికల్ బోర్డును రద్దు చేస్తారనే ప్రచారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఏ జిల్లాను తొలగించడం గానీ, కొత్త జిల్లాను ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వ పరిశీలనలో లేదన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడవటంచ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం ఆశీర్వచనం అందించారు. దేవాలయ అతిథి గృహంతో పాటు ఇతర అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. దేవాలయ ప్రాంగణంలో మొక్కను నాటారు.

ఆ తర్వాత 'ప్రజా పాలన-ప్రగతి బాట' కార్యక్రమంలో భాగంగా జయశంకర్ జిల్లా చెల్పూరు గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ, సింగరేణి మెడికల్ బోర్డు అంశాలపై స్పష్టతనిచ్చారు.
కొన్ని జిల్లాలను రద్దు చేస్తారని, సింగరేణి మెడికల్ బోర్డును రద్దు చేస్తారంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు. ఏ జిల్లాను తొలగించడం గానీ, కొత్త జిల్లాను ఏర్పాటు చేసే ఆలోచనగానీ ప్రభుత్వ పరిశీలనలో లేదన్నారు. సింగరేణి మెడికల్ బోర్డు రద్దు చేస్తారంటూ కొందరు తప్పుడు, విష ప్రచారం చేస్తున్నారని అన్నారు. అలాంటి ఆలోచనలే ప్రభుత్వం చేయడం లేదని స్పష్టం చేశారు.
'జయశంకర్ భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తారంటూ తప్పుడు విష ప్రచారం చేస్తున్నారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఏ జిల్లాను తొలగించడం గానీ, కొత్త జిల్లాను ఏర్పాటు చేసే ఆలోచన గానీ ప్రభుత్వ పరిశీలనలో లేదు. ఎక్కడైనా జిల్లాల్లో పునర్వ్యవస్థీకరించాలి లేదా రేషనలైజేషన్ చేయాలంటే బహిరంగంగా ప్రజలకు చెప్పి శాసనసభలో చర్చించి, ప్రతిపక్షాల సూచనలు తీసుకున్న తర్వాతనే జిల్లాల గురించి ఆలోచనలు చేస్తాం.' అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ఎవరెన్ని కుట్రలు పన్నినా, ఎవరెన్ని అపోహలు సృష్టించినా, భూపాలపల్లి ప్రాంతం చైతన్యవంతమైన ప్రాంతం, కుట్రలు కుతంత్రాలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారో వారిని పసిగట్టగలిగే శక్తి భూపాలపల్లి ప్రజలకు ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. భూపాలపల్లిని అభివృద్ధి పథంలో నడిపిస్తాం అని హామీ ఇచ్చారు.
సింగరేణి మెడికల్ బోర్డుకు సంబంధించి జరుగుతున్న ప్రచారాన్ని రేవంత్ రెడ్డి ఖండించారు. 'ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు సింగరేణి పరీవాహక ప్రాంతంలో వేలాది సింగరేణి కార్మిక కుటుంబాలున్నాయి. కార్పొరేట్ మెడికల్ బోర్డును రద్దు చేస్తుందని, వారసత్వ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పోతాయని కొందరు తప్పుడు, విష ప్రచారం చేస్తున్నారు.' అని రేవంత్ రెడ్డి చెప్పారు.
2027లో నిర్వహించబోయే పుష్కరాలపై రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు గోదావరి పరీవాహక ప్రాంతంలోని బాసర నుంచి భద్రాచలం వరకు ప్రతి ఆలయాన్ని పర్యాటక పుణ్యక్షేత్రాలుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. అటవీ ప్రాంతాల్లో రిసార్టులను నిర్మించి పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. గతేడాది సరస్వతి పుష్కరాలను అద్భుతంగా నిర్వహించుకున్నామన్నారు. అలాగే వెయ్యేండ్లు గుర్తుండే విధంగా మేడారంను తీర్చిదిద్దుకుని సమ్మక్క – సారలమ్మ జాతరను దక్షిణ కుంభమేళాగా గొప్పగా నిర్వహించామన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో వివిధ అభివృద్ధి పనుల కోసం రూ. 6,116 కోట్లను కేటాయించామని వాటి వివరాలను సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ తొలి, మలి విడత పోరాటంలో వరంగల్ జిల్లా ప్రజలు, కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల పాత్ర, ప్రొఫెసర్ జయశంకర్ పాత్రను ముఖ్యమంత్రి గారు గుర్తుచేశారు.
మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌తోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ బహిరంగ సభ వేదిక నుంచి ముఖ్యమంత్రి.. సమ్మక్క - సారలమ్మ జిల్లా మహిళా సమాఖ్యకు రూ. 205 కోట్ల బ్యాంకు లింకేజీ చెక్కును అందజేశారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


