రేవంత్ రెడ్డి 'తిట్ల ట్రాప్'లో పడకండి.. సమస్యలపైనే ఫోకస్ చేయండి - పార్టీ శ్రేణులకు KTR పిలుపు
రేవంత్ రెడ్డి 'తిట్ల ట్రాప్'లో పడొద్దని పార్టీ కేడర్ కు కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపైనే పోరాటం చేయాలన్నారు. వేములవాడలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ మున్సిపల్ ఎన్నికల్లో పని చేయాలని సూచించారు.
హామీల అమలును కప్పిపుచ్చుకోవడానికి కీలకమైన మున్సిపల్ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిట్ల దండకం అందుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అయితే రేవంత్ రెడ్డి తిట్ల ట్రాప్ లో పడవద్దని పార్టీ కేడర్ కు పిలుపునిచ్చారు. తెలంగాణ గడ్డపై ప్రస్తుతం ఒక వికృతమైన రాజకీయ క్రీడ నడుస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కేసీఆర్ ఎప్పుడూ బిరుదుల కోసం… సన్మానాల కోసం పాకులాడలేదని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజల శ్రేయస్సు మరియు సంక్షేమమే ఆయనకు నిజమైన సత్కారమని స్పష్టం చేశారు.
“నేడు అధికార గర్వంతో రేవంత్ రెడ్డి తన ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ వ్యక్తిత్వం మీద విషం చిమ్ముతున్నారు. ఇది కేవలం ఒక వ్యక్తి మీద జరుగుతున్న దాడి కాదు. తెలంగాణ ఉద్యమ చరిత్ర మీద జరుగుతున్న దాడి” అని కేటీఆర్ అభివర్ణించారు.
తిట్ల ట్రాప్ లో పడకండి - కేటీఆర్ పిలుపు
రేవంత్ రెడ్డి పన్నుతున్న 'తిట్ల ట్రాప్'లో పార్టీ శ్రేణులు ఎవరూ పడకూడదని కేటీఆర్ సూచించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చర్చ జరగాల్సింది.. వార్డుల్లోని మౌలిక వసతులు, రోడ్లు, డ్రైనేజీ మరియు ఇంటింటికీ అందాల్సిన పథకాల మీదనే అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి తన బూతు పురాణంతో అసలు చర్చను పక్కదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు.
అబద్ధపు ఆరు గ్యారంటీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎరువుల కోసం క్యూ లైన్లలో రైతులు పడుతున్న పాట్లు, రైతు భరోసా అందక ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల కోరల్లో చిక్కుకున్న అన్నదాతల కష్టాల గురించి గొంతెత్తాలని సూచించారు. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక చదువులు ఆగిపోతున్న బిడ్డల వేదనకు, గురుకులాల్లో విషాహారం తిని అల్లాడి పోతున్న పసి ప్రాణాలకు రేవంత్ రెడ్డే బాధ్యత వహించాలన్నారు.
రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న వృద్ధులు, డీఏలు మరియు పీఆర్సీ లేక నలిగిపోతున్న ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన నిలబడాలని కేటీఆర్ కోరారు. సింగరేణి బొగ్గు స్కామ్, విద్యుత్ కుంభకోణాల వెనుక ఉన్న అసలు దొంగలెవరో ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలన్నారు. మన నీటి వాటాను పక్క రాష్ట్రాలకు ధారాదత్తం చేస్తున్న రేవంత్ రెడ్డి 'కోవర్టు' ద్రోహాన్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
ప్రజల తీర్పే కేసీఆర్ కి ఇచ్చే అసలైన గౌరవమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పదేళ్ల ఉజ్వల ప్రగతి తర్వాత ఈ రెండేళ్లలో తెలంగాణ అనుభవిస్తున్న ఈ దుర్గతికి కారణాలను ప్రజల ముందుకు బలంగా తీసుకెళ్లాలని కోరారు. రేవంత్ అనే రాహువు నుండి రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి బిడ్డపై ఉందని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి అసమర్థ పాలనపై మున్సిపల్ ఎన్నికల్లో ప్రశ్నలను పిడుగుల్లా కురిపించాలని…. ప్రజాస్వామ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకుందామని ఆయన పిలుపునిచ్చారు.

E-Paper












