డిసెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేసేలా ప్లాన్.. అంతకుముందు రైతు భరోసా!

తెలంగాణలో స్థానిక ఎన్నికల్లో బీసీ కోటాపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. అయితే కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా.. డిసెంబర్‌లో ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం అనుకుంటోంది.

Published on: Oct 27, 2025, 12:25:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నవంబర్ చివరి నాటికి లేదా డిసెంబర్ మొదటి వారంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. డిసెంబర్‌లో స్థానిక ఎన్నికలు పూర్తి చేసేలా ప్రణాళికలు వేస్తోంది. నవంబర్ 3న వెనకబడిన తరగతులకు(బీసీ) 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు కేసును విచారించనుంది.

స్థానిక సంస్థల ఎన్నికలు
స్థానిక సంస్థల ఎన్నికలు

కోర్టు ఉపశమనం ఇస్తుందా లేదా అనే దానిపై ఆధారపడి ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యామ్నాయ ప్రణాళికలను రూపొందించిందని సమాచారం. గతంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే జీవో 9 అమలును హైకోర్టు నిలిపివేసింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీంకోర్టు తుది విచారణ కోసం హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. దీంతో ప్రభుత్వం ఎదురుచూస్తొంది. అయితే హైకోర్టు ఎలాంటి తీర్పు వెలువరించినా.. డిసెంబర్‌లో ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం అనుకుంటోంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నవంబర్ 7న కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో హైకోర్టు నిర్ణయం ఆధారంగా ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్‌పై నిర్ణయం తీసుకుంటుంది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కేబినెట్ అధికారికంగా అభ్యర్థించనుంది.

కోర్టు స్టే ఎత్తివేస్తే 42 శాతం బీసీ రిజర్వేషన్లతో ఎన్నికలు జరుగుతాయి. అయితే స్టే కొనసాగితే కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీలకు 42 శాతం ప్రాతినిధ్యం కేటాయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు పార్టీ తరఫున 42 శాతం బీసీ కోటాను అమలు చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.

నవంబర్ చివరిలో లేదా డిసెంబర్ ప్రారంభంలో ఎన్నికలకు సిద్ధం కావాలని ఈసీకి ప్రభుత్వం తెలపనుంది. కోర్టు ఉపశమనం ఇవ్వకపోతే ప్రస్తుతమున్న 23 శాతం బీసీ కోటా కింద ఎన్నికలు జరుగుతాయి. కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేలా ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం.

హైకోర్టు తీర్పు తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోనున్నట్టుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ సంతానం ఉన్న అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు. ఈ మేరకు గతంలో ఉన్న నిబంధనను ఎత్తివేస్తున్నట్టుగాప్రకటించింది.

మరోవైపు ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేయడంపై కూడా దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. నవంబర్, డిసెంబర్‌లలో రబీ సీజన్ ప్రారంభానికి ముందు రైతులకు ప్రయోజనం చేకూర్చేలా నిధులను విడుదల చేసే అవకాశం ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత ప్రభుత్వ పథకాల కింద రైతుల ఖాతాలకు ఆర్థిక బదిలీలు చేయలేరు. కాబట్టి ముందుగానే నిధులు బదిలీ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. ఈ లెక్కన నవంబర్‌లో రైతు భరోసా నిధులు రావొచ్చు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More