త్వరలో తెలంగాణ మోటార్ వెహికల్ అగ్రిగేటర్ పాలసీ.. ఎందుకోసం ఇది?

యాప్ ఆధారిత అగ్రిగేటర్ల కోసం ఒక సమగ్ర మోటార్ వెహికల్ అగ్రిగేటర్ పాలసీని త్వరలో తీసుకురానున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ పాలసీ ద్వారా ప్రయాణికులకు సేవలు మరింత అనుకూలంగా మారనున్నాయి.

Published on: Aug 7, 2026, 09:44:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్‌తో పాటు తెలంగాణవ్యాప్తంగా ఓలా, ఉబర్, రాపిడో వంటి యాప్ ఆధారిత వాహన సేవలను మరింత సురక్షితంగా, పారదర్శకంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. త్వరలోనే నూతన మోటార్ వెహికల్ అగ్రిగేటర్ పాలసీని అమలులోకి తీసుకురానున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రవాణా వ్యవస్థలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడం, ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడం ఈ విధానం ప్రధాన లక్ష్యమని చెప్పారు.

తెలంగాణ మోటార్ వెహికల్ అగ్రిగేటర్ పాలసీ
తెలంగాణ మోటార్ వెహికల్ అగ్రిగేటర్ పాలసీ

ఈ నూతన విధాన రూపకల్పన కోసం ప్రభుత్వం ఇదివరకే ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ప్రతినిధులు క్యాబ్ డ్రైవర్ల సంఘాలు, అగ్రిగేటర్ సంస్థల యాజమాన్యాలు, ప్రయాణికుల హక్కుల నిపుణులతో సమగ్రంగా చర్చించారు. ప్రస్తుతం చివరి దశకు చేరుకున్న ఈ నివేదికను కమిటీ త్వరలోనే ప్రభుత్వానికి సమర్పించనుంది. నివేదిక అందగానే నూతన నిబంధనలను నోటిఫై చేయనున్నారు.

ఈ కమిటీ పలు అంశాలను లోతుగా అధ్యయనం చేసి సిఫార్సులను సిద్ధం చేసింది. ముఖ్యంగా ప్రయాణికుల రక్షణ, వాహనాల ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్, పర్మిట్లతో పాటు ప్లాట్‌ఫామ్ డ్రైవర్ల సంక్షేమానికి పెద్దపీట వేసింది. ప్రస్తుతం డ్రైవర్లు ఎదుర్కొంటున్న అధిక కమిషన్ సమస్యలు, పని గంటలు, సర్జ్ ప్రైసింగ్ పద్ధతులను నియంత్రించేందుకు కచ్చితమైన మార్గదర్శకాలు రానున్నాయి.

పాలసీలోని ప్రధాన ప్రతిపాదనలు చూసుకుంటే.. ప్రయాణ ధరల్లో అక్రమ వ్యత్యాసాలు లేకుండా పారదర్శకమైన ఛార్జీల నియంత్రణ వ్యవస్థ ఉంటుంది. మహిళా ప్రయాణికులు, మహిళా డ్రైవర్ల భద్రత కోసం ప్రత్యేక డిజిటల్ పర్యవేక్షణ, ఎమర్జెన్సీ బటన్ సదుపాయం అందిస్తారు. ప్రయాణికులు, డ్రైవర్ల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సమర్థవంతమైన గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ తీసుకువస్తారు.

పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం కూడా ఈ పాలసీలో భాగం. అగ్రిగేటర్ సంస్థలు, రవాణా శాఖ మధ్య సమాచార మార్పిడి ద్వారా భద్రతను పర్యవేక్షించడం చేస్తారు. ఈ విధానం అమలులోకి వస్తే ప్రయాణికులకు సురక్షితమైన రవాణా అందడమే కాకుండా, వేలాది మంది గిగ్ వర్కర్లు, డ్రైవర్ల హక్కులకు చట్టబద్ధమైన రక్షణ లభిస్తుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More