డీలిమిటేషన్‌లో ఓబీసీ ప్రాతినిధ్యమేది? కేంద్రంపై వి.హనుమంతరావు ఫైర్

డీలిమిటేషన్ బిల్లు విషయంలో కేంద్రం తొందరపాటును తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు ప్రశ్నించారు. ఓబీసీ ప్రాతినిధ్యాన్ని పట్టించుకోకుండా సీట్ల సంఖ్య పెంపుపైనే దృష్టి పెట్టారని ఆరోపించారు. ఇండియా కూటమి మూడు కీలక డిమాండ్లను ప్రకటించింది.

Published on: Nov 28, 2026, 15:07:55 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ప్రతిపాదిత డీలిమిటేషన్ బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వం చూపుతున్న అత్యవసరాన్ని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు శనివారం ప్రశ్నించారు. ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) ప్రాతినిధ్యానికి తగిన ప్రాధాన్యం ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. ప్రభుత్వం కేవలం లోక్‌సభ సీట్ల సంఖ్య పెంచడంపైనే దృష్టి పెట్టిందని ఆరోపించారు.

ఇండియా కూటమి సమావేశం అనంతరం తన నివాసంలో ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్న ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే (Amit )
ఇండియా కూటమి సమావేశం అనంతరం తన నివాసంలో ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్న ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే (Amit )

హైదరాబాద్‌లో మాట్లాడిన హనుమంతరావు.. డీలిమిటేషన్ ద్వారా ఎంపీల సంఖ్య పెంచడాన్ని అర్థం చేసుకోగలనని, కానీ ఓబీసీ జనాభా సంగతేమిటని ప్రశ్నించారు. "మీకు ఇంత తొందర ఎందుకు? నాకు అర్థం కావడం లేదు. డీలిమిటేషన్ ద్వారా ఎంపీల సంఖ్య పెంచడాన్ని నేను అర్థం చేసుకోగలను, కానీ ఓబీసీ జనాభా సంగతేమిటి? ఓబీసీ ప్రాతినిధ్యాన్ని పూర్తిగా పక్కనపెట్టి పార్లమెంటు సీట్ల సంఖ్య పెంచడంపైనే మీరు దృష్టి పెట్టారు" అని ఆయన అన్నారు.

ఇండియా కూటమి మూడు ప్రధాన డిమాండ్లు

నవంబరు 30 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు ముందు ఉమ్మడి వ్యూహంపై చర్చించేందుకు శనివారం న్యూఢిల్లీలో ఇండియా కూటమి ఫ్లోర్ లీడర్లు సమావేశమయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన ఈ భేటీలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు పలువురు విపక్ష నేతలు పాల్గొన్నారు.

సమావేశం అనంతరం డీలిమిటేషన్ ప్రక్రియపై మూడు కీలక డిమాండ్లను కాంగ్రెస్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. లోక్‌సభ ప్రస్తుత బలాన్ని అలాగే ఉంచాలని, ప్రస్తుత లోక్‌సభ బలం ఆధారంగానే మహిళా రిజర్వేషన్ కల్పించాలని, రాష్ట్రాల మధ్య లోక్‌సభ సీట్ల కేటాయింపును వచ్చే 25 ఏళ్ల పాటు మార్చకుండా కొనసాగించాలని డిమాండ్ చేసింది. ఈ సమావేశంలో ప్రియాంక గాంధీ వాద్రా, పవన్ ఖేరా, కె.సి. వేణుగోపాల్, సయ్యద్ నసీర్ హుస్సేన్, ప్రమోద్ తివారీ, గౌరవ్ గొగొయి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, డెరెక్ ఓబ్రెయిన్ తదితరులు హాజరయ్యారు.

విపక్షంలో చీలికలు, కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు

ప్రతిపాదిత బిల్లుపై స్పందించిన కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్.. ఇండియా కూటమిలో విభేదాలు బయటపడ్డాయని అన్నారు. కూటమిలోని పలు పార్టీలు ప్రభుత్వ ప్రతిపాదనకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. "ఇండియా కూటమిలో చీలికలు ఎలా వచ్చాయో స్పష్టంగా కనిపిస్తోంది, పలు భాగస్వామ్య పార్టీలు మా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి. ఇది ప్రతి రాష్ట్రానికీ మేలు చేసే మంచి ప్రతిపాదన అని నేను భావిస్తున్నాను..." అని చిరాగ్ పాశ్వాన్ పేర్కొన్నారు.

మరోవైపు డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌పై బీజేపీ రాజ్యసభ ఎంపీ కె.లక్ష్మణ్ విమర్శలు గుప్పించారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల ప్రయోజనాలకు కాంగ్రెస్ వ్యతిరేకమని ఆరోపించారు. "ఈ డీలిమిటేషన్ బిల్లును ఆమోదించడానికి ఎందుకు ముందుకు రావడం లేదో కాంగ్రెస్ దేశంలోని మహిళలకు సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ మహిళా వ్యతిరేకి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వ్యతిరేకి. సీట్ల సంఖ్య పెంచితే పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల్లోకి మరింత మంది మహిళలు వస్తారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వు చేసిన సీట్ల సంఖ్య కూడా పెరిగి, సభలో వారికి బలమైన గొంతు లభిస్తుంది. ఎస్సీ, ఎస్టీలు, మహిళలు, యువత ప్రయోజనాల కోసం తెచ్చిన బిల్లును కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకిస్తోంది? దేశ ప్రయోజనాల కోసం, సమాజంలోని అన్ని వర్గాల కోసం మోదీ ప్రభుత్వం తెచ్చే ప్రతి బిల్లునూ వ్యతిరేకించడమే కాంగ్రెస్ ఏకైక ఎజెండా..." అని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.

నియోజకవర్గాల పునర్విభజన, లోక్‌సభ బలం పెంపుపై విపక్షాలు, అధికార పక్షం మధ్య మాటల యుద్ధం ముదురుతుండగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఈ అంశంపై వాడివేడి చర్చలు జరిగే అవకాశం ఉంది.

ABOUT THE AUTHOR

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.