...
...
Next Story

మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టొద్దని ఏ నిపుణుడూ చెప్పలేదు : హరీశ్ రావు

మేడిగడ్డ బ్యారేజ్, కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. నిపుణుల కమిటీ నివేదికలు, పీసీ ఘోష్ కమిషన్ అఫిడవిట్ వివరాలను బయటపెట్టారు.

Published on: Jul 8, 2026, 15:26:55 IST
Advertisement

కాళేశ్వరం ప్రాజెక్టు అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టొద్దని ఏ నిపుణుడూ చెప్పలేదని, అక్కడ నిర్మాణానికి అనుకూలంగానే ఉందని రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ స్పష్టమైన నివేదిక ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కు సైతం రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ ఈ విషయాలను అఫిడవిట్ రూపంలో సమర్పించిందని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ భవన్‌లో హరీశ్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

హరీశ్ రావు
హరీశ్ రావు

రైతుల ప్రయోజనాల కంటే రేవంత్ రెడ్డికి రాజకీయాలే ముఖ్యంగా మారాయని, కేసీఆర్‌కు పేరు వస్తుందనే కుళ్లుతోనే మేడిగడ్డ దగ్గర వృథాగా పోతున్న గోదావరి జలాలను ఎత్తిపోయడం లేదని హరీశ్ రావు ధ్వజమెత్తారు. ప్రాజెక్టు సాంకేతికతపై మాట్లాడిన హరీశ్ రావు.. 'మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ నిర్మించవచ్చు కానీ, అక్కడ నుంచి నేరుగా మిడ్ మానేరుకు నీటిని తీసుకెళ్లడం సాధ్యం కాదని ఆనాడు రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ సూచించింది. ఆ నిపుణుల కమిటీ సూచనలను గౌరవించి, నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నేరుగా నీళ్లు తరలించే ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. కమిటీ చెప్పిన మార్గదర్శకాల ప్రకారమే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించాం. ఈ విషయాన్ని రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ పీసీ ఘోష్ కమిషన్‌కు అఫిడవిట్ రూపంలో అధికారికంగా సమర్పించింది. వాస్తవాలు ఇలా ఉంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం నిపుణుల కమిటీ రిపోర్టును పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు.' అని హరీశ్ రావు మండిపడ్డారు.

రాష్ట్రంలో వర్షాలు పడటం లేదని, నీరు లేకుండా ఎలా ఎత్తాలని నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటాన్ని హరీశ్ రావు తీవ్రంగా తప్పుపట్టారు. కరువు వచ్చినా, కాలం కాకపోయినా తెలంగాణలో నీళ్లు నిల్వ ఉండే ఏకైక ప్రాంతం మేడిగడ్డ కాబట్టే కేసీఆర్ అక్కడ బ్యారేజ్ కట్టారని స్పష్టం చేశారు.

'ఈ నిమిషంలో కన్నేపల్లి (లక్ష్మీ) పంప్‌హౌస్ దగ్గర మోటార్లు ఆన్ చేస్తే కనీసం 3 టీఎంసీల నీటిని సులభంగా లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మోటార్లు ఆన్ చేయడం లేదు. నీళ్లు ఎత్తిపోస్తే కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందనే ఏకైక కుట్రతో రేవంత్ రెడ్డి రైతుల గొంతు కోస్తున్నారు. నీళ్లు వృథాగా పోతుంటే చూస్తూ కూర్చోవడం రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం.' అని హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయాలు ముఖ్యమా లేక తెలంగాణ రైతాంగ సంక్షేమం ముఖ్యమా అని ఆయన ప్రశ్నించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe