Telangana heavy Rain Alert : తెలంగాణకు వాతావరణ కేంద్రం కీలక అలర్ట్ జారీ చేసింది. రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ ప్రకారం…. జూన్ 12 నుంచి జూన్ 14 వరకు రాష్ట్రంలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో కొన్ని చోట్ల వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుండి 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉన్నందున ఉత్తర తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
రాష్ట్రవ్యాప్తంగా గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
జూన్ 15 తర్వాత కూడా వర్షాల జోరు తగ్గబోదని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. జూన్ 15 నుంచి 17 వరకు నల్గొండ, సూర్యాపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు పడొచ్చు. ఈదురుగాలుల వేగం గంటకు 30 నుండి 40 కిలోమీటర్లు ఉంటుంది. జూన్ 17 నుండి జూన్ 19 వరకు గాలి వేగం మరింత పుంజుకుని గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయి.