...
...
Next Story

తెలంగాణలో రాగల 48 గంటలు భారీ వర్షాలు.. ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఇలా!

తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా కొన్ని ప్రాంతాల్లో జల్లులు పడనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ వివరాలు వెల్లడించింది.

Updated on: Jul 29, 2026, 11:31:31 IST
Advertisement

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. రానున్న రెండు రోజుల పాటు (జులై 29, 30 తేదీలు) రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య, పశ్చిమ తెలంగాణ జిల్లాలలో వర్ష తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది.

ఏపీ, తెలంగాణ వానలు
ఏపీ, తెలంగాణ వానలు

పరిస్థితి తీవ్రతను బట్టి వాతావరణ శాఖ వివిధ జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్న జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటిస్తూ ప్రజలను అప్రమత్తం చేసింది. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.

మరికొన్ని జిల్లాల్లో భారీ వర్ష సూచనతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇందులో ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, ములుగు, జనగాం, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, మేడ్చల్ మల్కాజ్‌గిరి, రాజధాని హైదరాబాద్‌తో సహా 21 జిల్లాలు ఉన్నాయి.

జీహెచ్‌ఎంసీ పరిధిలోని హైదరాబాద్, పరిసర ప్రాంతాలలో రోజంతా ఆకాశం పూర్తిస్థాయిలో మేఘావృతమై ఉంటుందని అధికారులు తెలిపారు. నగరంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశముంది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు నమోదు కావొచ్చని అంచనా వేశారు.

రాబోయే 36 గంటల్లో ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మొత్తం వర్షపాతం 300-450 మి.మీ వరకు నమోదై, భారీ వరదలకు దారితీయవచ్చు. నాగర్‌కర్నూల్, వనపర్తి, నల్గొండ వంటి దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కేవలం తేలికపాటి వర్షాలు మాత్రమే కురుస్తాయి.

ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం రోజున పలు జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వానలు పడే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. శ్రీకాకుళం, మన్యం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కోనసీమ, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, కృష్ణా, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe