Hyderabad : నీటిని వృథా చేస్తున్నారా..? ఈ నెంబర్లకు ఫిర్యాదు చేయండి - జలమండలి ప్రకటన

హైదరాబాద్‌లో తాగునీటి దుర్వినియోగానికి చెక్ పెట్టేందుకు జలమండలి ప్రత్యేక చర్యలు చేపట్టింది. నీటిని వృథా చేస్తే ఫొటోలు, వీడియోలతో వాట్సాప్‌లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది.

Published on: Oct 19, 2026, 06:01:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

హైదరాబాద్ నగరంలో తాగునీటి సంరక్షణపై జలమండలి ప్రత్యేక దృష్టి సారించింది. వేసవి సమీపిస్తున్న తరుణంలో నీటి కొరత తలెత్తకుండా ఉండాలంటే ప్రతి నీటి చుక్కనూ పొదుపుగా వాడుకోవడం అత్యంత అవసరమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నగరంలో ఎక్కడైనా తాగునీటి వృథా లేదా దుర్వినియోగం జరుగుతున్నట్లు గమనిస్తే…. వెంటనే తమకు సమాచారం అందించాలని మహానగర పౌరులకు జలమండలి విజ్ఞప్తి చేసింది.

నీటిని వృథా చేస్తున్నారా..? ఈ నెంబర్లకు ఫిర్యాదు చేయండి - జలమండలి ప్రకటన
నీటిని వృథా చేస్తున్నారా..? ఈ నెంబర్లకు ఫిర్యాదు చేయండి - జలమండలి ప్రకటన

ఫిర్యాదుల కోసం ప్రత్యేక నంబర్లు

తాగునీటి దుర్వినియోగానికి సంబంధించిన ఘటనలు పౌరుల దృష్టికి వచ్చిన వెంటనే స్పందించేందుకు అధికారులు ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు.

  • నీటి వృథాకు సంబంధించిన స్పష్టమైన ఫొటోలు, వీడియోలు, ఘటనకు పాల్పడుతున్న వ్యక్తులు లేదా సంస్థల వివరాలు, సదరు ప్రాంతం పూర్తి చిరునామాతో సహా జలమండలి వాట్సాప్ నంబర్ 99499 30003 కు పంపించవచ్చు.
  • నేరుగా ఫోన్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయాలనుకునే వారు జలమండలి కస్టమర్ కేర్ నంబర్ 155313 కు కాల్ చేయవచ్చని అధికారులు వెల్లడించారు.

పౌరుల నుంచి అందిన ప్రతి ఫిర్యాదుపై జలమండలి అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి తక్షణమే విచారణ చేపడతారు. ఈ తనిఖీల్లో నిబంధనల ఉల్లంఘన లేదా నీటి వృథా నిర్ధారణ అయితే, సదరు వ్యక్తులు లేదా సంస్థలపై జలమండలి చట్టపరమైన విధివిధానాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా భారీ జరిమానాలు విధించడంతో పాటు, తాగునీటి కనెక్షన్లను తొలగించడం, వాటర్ ట్యాంకర్ల సరఫరా నిలిపివేయడం వంటి తీవ్ర చర్యలు ఉంటాయి.

నీటి దుర్వినియోగంపై సమాచారం అందించే పౌరుల భద్రతకు జలమండలి పూర్తి హామీ ఇచ్చింది. ఫిర్యాదు చేసిన వ్యక్తుల వివరాలను, వారి వ్యక్తిగత సమాచారాన్ని అత్యంత గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేసింది. ఎలాంటి సంకోచం లేకుండా పౌరులంతా బాధ్యతాయుతంగా ముందుకు వచ్చి, హైదరాబాద్ నగర తాగునీటి సంరక్షణ ఉద్యమంలో భాగస్వాములు కావాలని జలమండలి అధికారులు పిలుపునిచ్చారు.

ప్రత్యేక కార్యాచరణ :

మరోవైపు నీటి కొరతను నివారించేందుకు హైదరాబాద్ నీటి సరఫరా, మురుగునీటి పారుదల మండలి తక్షణ ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టింది. నిర్మాణ రంగం, పరిశ్రమలు, పార్కులు, ల్యాండ్‌స్కేపింగ్ వంటి తాగునీరేతర అవసరాలకు భూగర్భజలాలు లేదా మంచినీటిని వాడకుండా, ఎస్టీపీల్లో (STP) శుద్ధి చేసిన నీటిని మాత్రమే వినియోగించాలని జలమండలి ఎండీ ఆదేశించారు. తొలి దశలో భాగంగా ప్రతిరోజూ 100 ఎంఎల్‌డీ (MLD) శుద్ధి చేసిన నీటిని ఇలా ప్రత్యామ్నాయ అవసరాలకు మళ్లించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

  • పరిశ్రమలు, నిర్మాణ రంగానికి సులభంగా శుద్ధి చేసిన నీటిని అందించేందుకు నవంబర్ 1 నుంచి 'డయల్-ఏ-గ్రీన్ ట్యాంకర్' సేవలను అందుబాటులోకి తేనున్నట్లు జలమండలి ప్రకటించింది.
  • ఈ సేవల కోసం వారం లేదా పది రోజుల్లో ఒక ప్రత్యేక డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేస్తున్నారు. దీని ద్వారా ఆన్‌లైన్ బుకింగ్, ట్యాంకర్ లైవ్ ట్రాకింగ్ సౌకర్యాలు కల్పిస్తారు.
  • ఇప్పటివరకు 51 ప్రైవేట్ ఎస్టీపీలు తమ పేర్లను నమోదు చేసుకున్నాయి. వీటి ద్వారా రోజుకు సుమారు 1.5 ఎంఎల్‌డీ మిగులు శుద్ధి చేసిన నీరు అందుబాటులో ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
  • వీలైన చోట ఎస్టీపీల నుంచి నేరుగా పైప్‌లైన్ల ద్వారా, మిగిలిన చోట్ల ట్యాంకర్ల ద్వారా తక్కువ రవాణా ఖర్చుతో సరఫరా చేసేందుకు మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు.
  • రానున్న ఎనిమిది నెలల కాలం నగర నీటి నిర్వహణకు అత్యంత కీలకమైనదని జలమండలి అధికారులు అంచనా వేస్తున్నారు. తాగునీటి వనరులపై అనవసర ఒత్తిడి తగ్గించేందుకు పరిశ్రమలు, నిర్మాణ రంగాలు, సాధారణ ప్రజలు నీటి సంరక్షణలో భాగస్వాములు కావాలని ఎండీ పిలుపునిచ్చారు.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More