Hyderabad Water Shortage : అడుగంటిన భూగర్భజలాలు - ట్యాంకర్లకు భారీగా డిమాండ్..! నగరంలో ఈసారి నీటి కష్టాలు తప్పవా..?

Hyderabad Water Shortage : ఎల్‌నినో ప్రభావంతో హైదరాబాద్‌లో తీవ్ర నీటి కొరత ఏర్పడింది. ఈ అక్టోబర్‌లోనే  పలు ప్రాంతాల్లో ట్యాంకర్ల బుకింగ్స్ రెట్టింపయ్యాయి. దీంతో  జలమండలి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది.

Updated on: Oct 17, 2026, 09:35:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Hyderabad Water Shortage : భాగ్యనగర వాసులను ముందస్తుగానే తాగునీటి తిప్పలు చుట్టుముట్టాయి. సాధారణంగా ప్రతి ఏటా జనవరి, ఫిబ్రవరి నెలల్లో కనిపించే నీటి ఎద్దడి….. ఈసారి అక్టోబర్ మాసంలోనే మొదలై నగరవాసులను భయాందోళనకు గురిచేస్తోంది. ఎల్‌నినో ప్రభావం వల్ల ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం, దానికితోడు భూగర్భజలాలు దారుణంగా అడుగంటిపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు గృహావసరాల నుంచి పారిశ్రామిక అవసరాల వరకు ప్రతిదానికీ జలమండలి నీటి ట్యాంకర్లే దిక్కవుతున్నాయి.

ట్యాంకర్లకు క్యూ!
ట్యాంకర్లకు క్యూ!

అక్టోబర్‌లోనే డబుల్ డిమాండ్

జలమండలి అధికారిక గణాంకాలు నగరంలో పరిస్థితి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా చూపుతున్నాయి. గతేడాది అక్టోబర్‌లో రోజుకు సగటున 3 వేల నుంచి 4 వేల ట్యాంకర్ల బుకింగ్స్ నమోదు కాగా, ఈ సంవత్సరం ఆ సంఖ్య ఏకంగా రెట్టింపై 7 వేలకు చేరింది. ఇప్పటివరకు ఐటీ, కమర్షియల్ ప్రాంతాలకే పరిమితమైన నీటి కొరత…. ఇప్పుడు ఉప్పల్, ఎల్బీనగర్ వంటి నివాస ప్రాంతాలనూ తీవ్రంగా వేధిస్తోంది.

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పరిధిలోని విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్సులకు రోజువారీ అవసరాలకు ట్యాంకర్లు రానిదే గడిచే పరిస్థితి లేదు. మరోవైపు హాస్టళ్లు, వ్యాపార సంస్థలు అధికంగా ఉండే అమీర్‌పేట్, కృష్ణానగర్, ఎస్‌ఆర్ నగర్, ఎర్రగడ్డ, ఎల్లారెడ్డిగూడ ప్రాంతాల్లో ప్రజలు నీటి ట్యాంకర్ల కోసం గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది.నగరంలోని పలు బస్తీల్లోనూ సాధారణ రోజుల కంటే రెండు రెట్లు ఎక్కువ ట్యాంకర్లు బుక్ అవుతుండటం కొరత తీవ్రతకు అద్దం పడుతోంది.

"రూ.వేలల్లో ఖర్చు పెట్టి ప్రైవేట్ ట్యాంకర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. నల్లా నీళ్లు రావు, జలమండలి ట్యాంకర్లు సమయానికి రావు. ప్రైవేట్ వ్యాపారులు అడిగినంత ఇచ్చుకోక తప్పడం లేదు," అని పలు అపార్ట్‌మెంట్, బస్తీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జలమండలి ప్రత్యేక కార్యాచరణ……

ఈ తీవ్ర నీటి కొరతను నివారించేందుకు హైదరాబాద్ నీటి సరఫరా, మురుగునీటి పారుదల మండలి తక్షణ ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టింది. నిర్మాణ రంగం, పరిశ్రమలు, పార్కులు, ల్యాండ్‌స్కేపింగ్ వంటి తాగునీరేతర అవసరాలకు భూగర్భజలాలు లేదా మంచినీటిని వాడకుండా, ఎస్టీపీల్లో (STP) శుద్ధి చేసిన నీటిని మాత్రమే వినియోగించాలని జలమండలి ఎండీ ఆదేశించారు. తొలి దశలో భాగంగా ప్రతిరోజూ 100 ఎంఎల్‌డీ (MLD) శుద్ధి చేసిన నీటిని ఇలా ప్రత్యామ్నాయ అవసరాలకు మళ్లించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

  • పరిశ్రమలు, నిర్మాణ రంగానికి సులభంగా శుద్ధి చేసిన నీటిని అందించేందుకు నవంబర్ 1 నుంచి 'డయల్-ఏ-గ్రీన్ ట్యాంకర్' సేవలను అందుబాటులోకి తేనున్నట్లు జలమండలి ప్రకటించింది.
  • ఈ సేవల కోసం వారం లేదా పది రోజుల్లో ఒక ప్రత్యేక డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేస్తున్నారు. దీని ద్వారా ఆన్‌లైన్ బుకింగ్, ట్యాంకర్ లైవ్ ట్రాకింగ్ సౌకర్యాలు కల్పిస్తారు.
  • ఇప్పటివరకు 51 ప్రైవేట్ ఎస్టీపీలు తమ పేర్లను నమోదు చేసుకున్నాయి. వీటి ద్వారా రోజుకు సుమారు 1.5 ఎంఎల్‌డీ మిగులు శుద్ధి చేసిన నీరు అందుబాటులో ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
  • వీలైన చోట ఎస్టీపీల నుంచి నేరుగా పైప్‌లైన్ల ద్వారా, మిగిలిన చోట్ల ట్యాంకర్ల ద్వారా తక్కువ రవాణా ఖర్చుతో సరఫరా చేసేందుకు మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు.

రానున్న ఎనిమిది నెలల కాలం నగర నీటి నిర్వహణకు అత్యంత కీలకమైనదని జలమండలి అధికారులు అంచనా వేస్తున్నారు. తాగునీటి వనరులపై అనవసర ఒత్తిడి తగ్గించేందుకు పరిశ్రమలు, నిర్మాణ రంగాలు, సాధారణ ప్రజలు నీటి సంరక్షణలో భాగస్వాములు కావాలని ఎండీ పిలుపునిచ్చారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More