...
...
Next Story

Road Accident : హైదరాబాద్ - విజయవాడ హైవేపై ఘోర ప్రమాదం... నలుగురు మృతి

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద(విజయవాడ హైవే) ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి స్విఫ్ట్ కారును బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మరణించారు.

Published on: Jul 5, 2026, 08:04:22 IST
Advertisement

నల్గొండ జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున అత్యంత విషాదకర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామం వద్ద ఉన్న జాతీయ రహదారి(విజయవాడ హైవే)పై ప్రయాణిస్తున్న ఒక కారును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి అత్యంత బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఎనిమిదేళ్ల చిన్నారితో సహా నలుగురు వ్యక్తులు ఘటనా స్థలంలోనే దుర్మరణం పాలయ్యారు.

ప్రమాదానికి గురైన కారు
ప్రమాదానికి గురైన కారు

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితులు ప్రయాణిస్తున్న కారు విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ మార్గంలో వెళ్తోంది. పెద్దకాపర్తి స్టేజీ సమీపంలోకి రాగానే వేగంగా దూసుకొచ్చిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నియంత్రణ కోల్పోయి కారును వెనుక భాగం నుంచి బలంగా గుద్దింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా నలిగిపోయి ముక్కలైంది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఐదుగురు ఉన్నారు.

రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు సమాచారం అందించడంతో చిట్యాల పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారు డ్రైవర్ తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా.. అతడిని రక్షించి చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో మరణించిన నలుగురి మృతదేహాలను కారు శిథిలాల నుంచి వెలికితీసి… పోస్టుమార్టం పరీక్షల కోసం నల్గొండ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు.

కాకినాడకు చెందిన కుటుంబంగా గుర్తింపు

ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరంతా ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. సొంతూరి నుంచి తిరిగి హైదరాబాద్ వస్తుండగా నల్గొండ జిల్లా పరిధిలో ఈ ఘోరం జరిగిపోయింది. కారును ఢీకొట్టిన అనంతరం ప్రైవేట్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఈ ఘటనపై చిట్యాల పోలీసులు కేసు నమోదు చేసి, బస్సును స్వాధీనం చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks