జూబ్లీహిల్స్ ఉపఎన్నిక 2025 : చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలు - ఆసక్తికరంగా మారుతున్న బైపోల్ ఫైట్…!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. మంగళవారి అర్థరాత్రి వరకూ ఈ ప్రక్రియ కొనసాగింది. కేవలం నిన్న ఒక్కరోజే 117 మంది అభ్యర్థులు 194 సెట్ల నామినేషన్లు ఫైల్ చేశారు. ఇవాళ వీటిని పరిశీలించనున్నారు.

Published on: Oct 22, 2025, 09:45:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఆసక్తికరంగా మారుతోంది. మొదట్లో నామినేషన్లు తక్కువగానే ఉన్నప్పటికీ… చివరి రోజు ఊహించని రీతిలో పోటెత్తాయి. మంగళవారం అర్ధరాత్రి వరకూ ఈ ప్రక్రియ కొనసాగింది. ఊహించని రీతిలో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయడంతో ఈ ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక  2025
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక 2025

చివరిరోజు పోటెత్తిన నామినేషన్లు…

ఆఖరి రోజు(అక్టోబర్ 21) నాటికి మొత్తం 321 నామినేషన్ల సెట్లు దాఖలయ్యాయి. క్యూలైన్ లో ఉన్నవారికి అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా అవకాశం కల్పించారు. మొదటి ఆరు రోజుల్లో కేవలం 94 మంది అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయగా…. చివరి రోజు 117 మంది అభ్యర్థులు 194 నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్ల గడువు పూర్తి నాటికి మొత్తం 211 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

ఇక ఇవాళ నామినేషన్లను అధికారులు పరిశీలించనున్నారు. ఏమైనా తప్పులు ఉంటే పక్కన పెట్టే అవకాశం ఉంటుంది. ఇక పోటీ నుంచి ఉపసంహరణకు తుది గడువు 24వ తేదీగా నిర్ణయించారు. ఈ తేదీలోపు ఏవరైనా అభ్యర్థులు స్వయంగా పోటీ నుంచి తప్పుకోవచ్చు. ఈ ప్రక్రియ తర్వాతనే… జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో ఫైనల్ గా ఎంత మంది ఉంటారనేది తెలుస్తుంది. మరోవైపు నవంబర్‌ 11న పోలింగ్‌ జరగనుండగా.. ఓట్ల లెక్కింపును నవంబర్‌ 14న చేపట్టనున్నారు. ఇందుకోసం ఎన్నికల సంఘం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది.

ఇక ఈ ఉపఎన్నికలో ఈస్థాయిలో నామినేషన్లు దాఖలు కావటానికి పలు కారణాలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని ఫార్మా సిటీ రైతులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేశారు. అంతేకాకుండా ఆర్‌ఆర్‌ఆర్‌ భూసేకరణలో భూములు కోల్పోనున్న రైతులు కూడా ఈ వరుసలో ఉన్నారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ…. మాల సంఘాల నుంచి పదుల సంఖ్యలో నామినేషన్లు ఫైల్ అయ్యాయి. వీరి నుంచే కాకుండా పలువురు విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నుంచి కూడా నామినేషన్లు వేశారు. మొత్తంగా నగరం నడిబొడ్డున జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రోజుకింత పొలిటికల్ హీట్ ను పెంచుతోంది…!

ఈ ఏడాది జూన్ 8న భారత రాష్ట్ర సమితి సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నియోజకవర్గం పరిధిలో 3,92,669 ఓటర్లు ఉన్నారు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో పోలింగ్​ శాతం 47.49 నమోదైంది. ఈ నియోజకవర్గం నుంచి మాగంటి గోపీనాథ్ వరుసగా 3 పర్యాయాలు విజయం సాధించారు. 2023 ఎన్నికల్లో మాగంటి 80,549 ఓట్లు సాధించగా… సమీప కాంగ్రెస్ అభ్యర్థి అజాహరుద్దీన్​కు 64,212 ఓట్లు దక్కాయి. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి 25,866 ఓట్లు దక్కాయి.

ఈ ఉప ఎన్నిక కోసం గోపీనాథ్ భార్య మాగంటి సునీతను బీఆర్ఎస్ తన అభ్యర్థిగా ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ బరిలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి ఖరారయ్యారు. ఈ బై పోల్‌ను మూడు ప్రధాన పార్టీలు కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ప్రస్తుతానికి ప్రచారం జోరుగా సాగుతోంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More