జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. నవంబర్ 6 నుంచి ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎగ్జిట్ పోల్స్ మీద నిషేధం ప్రకటించింది.

Published on: Oct 15, 2025 3:06 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ, ప్రచురణ, ప్రచారంపై భారత ఎన్నికల సంఘం పూర్తి నిషేధం విధించింది. నవంబర్ 6న ఉదయం 7:00 గంటల నుండి నవంబర్ 11న సాయంత్రం 6:30 గంటల వరకు ఎగ్జిట్ పోల్ కార్యకలాపాలను నిషేధించినట్టుగా జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వీ కర్ణన్ తెలిపారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక

ఎగ్జిట్ పోల్స్ మీద కఠినమైన ఆంక్షలు విధిస్తున్నట్టుగా ఆర్వీ కర్ణన్ వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగాలి అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నవంబర్ 6 నుంచి నవంబర్ 11 వరకూ ఎగ్జిట్ పోల్స్‌కు సంబంధించి ఎలాంటి సమాచారం ప్రచురించడం లేదా ప్రసారం చేయకూడదని పేర్కొన్నారు.

ఈ కాలంలో టీవీ, రేడియో, వార్తాపత్రికలు, వెబ్‌సైట్‌లు, యూట్యూబ్, వాట్సాప్, ఎక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లేదా మరే ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఎగ్జిట్ పోల్ ఫలితాలు లేదా అంచనాలను వెల్లడించకూడదు. అలాంటి సమాచారం పంచుకోవడానికి ఏ వ్యక్తికి లేదా సంస్థకు అనుమతి లేదు.

నిబంధనలు ఉల్లంఘిస్తే.. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 126A కింద శిక్షార్హమైన చర్యలు తీసుకుంటారు. రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ ఉంటాయి. చట్టంలోని సెక్షన్ 126(1)(b) ప్రకారం, పోలింగ్ ముగిసే ముందు 48 గంటలలో అభిప్రాయ సేకరణలు లేదా సర్వేలతో సహా ఏదైనా ఎన్నికలకు సంబంధించిన విషయాన్ని ప్రదర్శించడం కచ్చితంగా నిషేధించారు.

స్వేచ్ఛగా, న్యాయంగా, పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ జరిగేలా పౌరులు, మీడియా సంస్థలు, రాజకీయ పార్టీలు మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ కోరారు.

జూబ్లీహిల్స్ బై పోల్ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. ఈ నెల 21వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అక్టోబర్ 22వ తేదీ వరకు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 24వ తేదీ దాకా ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. ఉప ఎన్నిక పోలింగ్ వచ్చే నెల 11న ఉంటుంది. 14న కౌంటింగ్ జరిగి ఆ తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు.

సువిధ పోర్టల్ ద్వారా కూడా నామినేషన్లు వేయవచ్చు. ఆన్‌లైన్‌లో నామినేషన్ పత్రాలు డౌన్‌లోడ్ చేసుకుని, ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే ఆన్‌లైన్ ద్వారా భర్తీ చేసినా.. స్వయంగా అభ్యర్థి హాజరు కావాలి. సంతకం, ప్రమాణం కోసం తప్పనిసరిగా వెళ్లాలి. నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసే సమయంలోపు హాజరు కావాలి.

News/Telangana/జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. నవంబర్ 6 నుంచి ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం
News/Telangana/జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. నవంబర్ 6 నుంచి ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం