...
...
Next Story

TG RERA : రెరా రిజిస్ట్రేషన్ లేకుండా ప్రీ-లాంచ్ ప్రకటనలు.. భారీగా జరిమానాలు

TG RERA : తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(RERA) కీలక హెచ్చరిక జారీ చేసింది. రెరా రిజిస్ట్రేషన్, అనుమతులు లేకుండా ముందుకెళ్తే భారీ జరిమానాలు తప్పవని స్పష్టం చేసింది.

Published on: Nov 25, 2026, 19:26:23 IST
Advertisement

తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలు చేస్తే.. భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించింది. తాజాగా TG RERA ఉత్తర్వులను జారీ చేసింది. కొండాపూర్‌లోని ఆరో సఫైర్(Auro Sapphire) నివాస ప్రాజెక్టుకు రెరా నమోదు పొందకుండానే ప్రకటనలు, ప్రచార కార్యక్రమాలు చేపట్టింది. దీంతో ఆరో రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు తెలంగాణ రెరా రూ.25 లక్షల జరిమానా విధించింది. సుమారు 8 ఎకరాల విస్తీర్ణంలో నాలుగు టవర్లు, 1,300కు పైగా నివాస యూనిట్లతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టులో ఫ్లాట్ల ధరలు రూ.2 కోట్ల నుంచి ప్రారంభమవుతాయంటూ రెరా నమోదు లేకుండానే డిజిటల్ మాధ్యమాల్లో ప్రచారం నిర్వహించినట్లు అథారిటీ గుర్తించింది.

తెలంగాణ రెరా
తెలంగాణ రెరా

టీజీ రెరా సంస్థ పేరు, లోగోను ఇతర వ్యక్తులు అనధికారికంగా ఉపయోగించారన్న ప్రమోటర్ వాదనను అథారిటీ తోసిపుచ్చింది. ప్రీ-లాంచ్ పేరుతో ప్రాజెక్టులకు ప్రచారం నిర్వహించడం ద్వారా తప్పనిసరి రెరా నమోదు నిబంధన నుంచి మినహాయింపు పొందలేరని స్పష్టం చేసింది. జరిమానా మొత్తాన్ని 30 రోజుల్లోగా చెల్లించాలని, లేనిపక్షంలో రెరా చట్టంలోని సెక్షన్ 63 ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

చందా నగర్‌లోని బహితి, సైనిక్‌పురిలోని ఆల్టెయిర్ ప్రాజెక్టులకు రెరా నమోదు పొందకుండానే ప్రకటనలు, ప్రచారం చేపట్టిన జనప్రియ టౌన్‌షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు తెలంగాణ రెరా రూ.10 లక్షల జరిమానా విధించింది. అంతేకాదు.. ఇప్పటికే రెరా నమోదు పొందిన నైల్ వ్యాలీ, లేక్ ఫ్రంట్, సితార ప్రాజెక్టుల ప్రకటనల్లో రెరా నమోదు సంఖ్యలు స్పష్టంగా కనిపించకుండా ప్రచురించడం ద్వారా ప్రకటనల మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు రెరా గుర్తించింది. జరిమానా మొత్తాన్ని 30 రోజుల్లోగా చెల్లించాలని, రెరా నమోదు పొందే వరకు సంబంధిత ప్రాజెక్టుల ప్రకటనలు, ప్రచారం, బుకింగ్‌లు, విక్రయాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. అవసరమైన అనుమతులు పొందిన 30 రోజుల్లోగా ఆయా ప్రాజెక్టుల రెరా నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది.

పుప్పాలగూడలోని వెస్ట్రన్ విండ్సర్ పార్క్ ప్రాజెక్టు ల్యాండ్, డెవలప్‌మెంట్ పనులకు సంబంధించి న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు, కోర్టు ఉత్తర్వుల పూర్తి వివరాలను 30 రోజుల్లోగా సమర్పించాలని వెస్ట్రన్‌ కన్‌‌స్ట్రక్షన్స్ విండ్సర్ పార్క్ ఎల్‌ఎల్‌పీ సంస్థను తెలంగాణ రెరా ఆదేశించింది. కోర్టు కేసుల వివరాలను ప్రతి ప్రాజెక్టుకు విడివిడిగా వెల్లడించాల్సిన బాధ్యత ప్రమోటర్‌పై ఉందని, ఒక ప్రాజెక్టుకు సంబంధించి వెల్లడించిన వివరాలను మరో ప్రాజెక్టుకు వర్తింపజేయలేమని స్పష్టం చేసింది.

హెచ్‌ఎండీఏ నివేదికతో పాటు అందుబాటులో ఉన్న పత్రాలను పరిశీలించిన రెరా ఎలాంటి జరిమానా విధించకుండానే సుమోటో విచారణను ముగించింది. విచారణ ముగింపు అనేది భూమిపై యాజమాన్య హక్కుల నిర్ధారణగా, భూమి స్వాధీనానికి చట్టబద్ధత కల్పించినట్లుగా లేదా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆక్రమణలకు ఆమోదం తెలిపినట్లుగా భావించరాదని స్పష్టం చేసింది. భవిష్యత్తులో కీలక సమాచారాన్ని దాచిపెట్టినా.. తప్పుడు వివరాలు సమర్పించినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

 

ABOUT THE AUTHOR

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks