ఇందిరమ్మ హౌసింగ్ టవర్స్‌కు రెరా అనుమతులు.. లబ్ధిదారులకు ఈజీగా బ్యాంక్ రుణాలు!

Indiramma Housing Towers : ఇందిరమ్మ ఇంట్ల టవర్స్‌ ప్రాజెక్టుకు రెరా అనుమతులు లభించాయి. ప్రభుత్వ పథకం కావడంతో రెరాకు అనుమతుల కోసం చెల్లించాల్సిన ఫీజులో రాయితీ దక్కింది.

Published on: Nov 24, 2026, 06:20:01 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని రెండు ప్రాంతాలలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ఇందిరమ్మ హౌసింగ్ టవర్లకు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (RERA) నుండి అనుమతులు లభించాయి. రాష్ట్రంలో ఒక ప్రభుత్వ గృహ నిర్మాణ ప్రాజెక్టుకు అనుమతులు లభించడం ఇదే మొదటిసారి.

ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు రెరా అనుమతులు
ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు రెరా అనుమతులు

మలక్‌పేట్, కుత్బుల్లాపూర్‌లోని టవర్లకు లభించిన ఈ అనుమతులతో, లబ్ధిదారులు బ్యాంకులనుంచి గృహ రుణాలు పొందగలరని తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారులు ప్రకటించారు. ఈ టవర్ల నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదు. ఇతర ప్రాంతాలలో ప్రతిపాదిత టవర్ల కోసం కూడా RERA అనుమతికి దరఖాస్తులు దాఖలు చేశారు. లబ్ధిదారుల హక్కుల పరిరక్షణ, పనుల్లో పారదర్శకతకు హౌసింగ్ బోర్డు చూపుతున్న నిబద్ధతకు రెరా అనుమతులే నిదర్శనం అని బోర్డు పేర్కొంది.

ఓఆర్ఆర్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో లక్ష ఫ్లాట్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒక పైలట్ ప్రాజెక్టులో భాగంగా 20 నియోజకవర్గాలలో ఒక్కోదానిలో 480 ఫ్లాట్ల నిర్మాణాన్ని ప్రారంభించింది. లబ్ధిదారుల ఎంపిక ఇప్పటికే పూర్తయింది. 480 చదరపు అడుగుల విస్తీర్ణం గల ప్రతి ఫ్లాట్‌కు ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీని అందిస్తోంది. లబ్ధిదారులు నాలుగు వాయిదాలలో రూ.6 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.

ఈ ఫ్లాట్లను ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్నారు, భూమిలోని వాటాను కూడా లబ్ధిదారుల పేర్ల మీద రిజిస్టర్ చేయనున్నారు. ఈ టవర్లను ఏడాదిలోగా పూర్తి చేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. బహిరంగ మార్కెట్లో ఒక్కో ఫ్లాట్ విలువ రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఉంటుందని అంచనా. లబ్ధిదారులకు దీనిని రూ.6 లక్షలకే అందిస్తుండటంతో, అనుమతులను వేగవంతం చేయడానికి RERA ఛైర్‌పర్సన్ కె. శ్రీనివాస్ రాజు చొరవ తీసుకున్నారని ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.

రెరా అనుమతులను ఒక మైలురాయిగా అభివర్ణిస్తూ, పారదర్శకత, జవాబుదారీతనం, నిర్మాణ నాణ్యతకు బోర్డు ప్రాధాన్యతనిస్తూనే ఉంటుందని హౌసింగ్ బోర్డ్ వైస్-ఛైర్‌పర్సన్ వి.పి. గౌతమ్ తెలిపారు. దీనిద్వారా బ్యాంకు రుణాలు త్వరగా మంజూరు అవుతాయి. నిర్మాణ విషయంలో అధికారులు జవాబుదారీగా ఉంటారని, నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని గౌతమ్ తెలిపారు. ఇందిరమ్మ హౌసింగ్ టవర్స్‌కు రెరా అనుమతులు ప్రతీ విషయంలోనూ కీలకం కానున్నాయి.

ABOUT THE AUTHOR

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.