Hyderabad : పని పనిమనుషుల ఎంపికలో జాగ్రత్త..! రెండేళ్లలో 565 కేసులు, ఈ విషయాలు తెలుసుకోండి
Servant Theft Cases in Hyderabad : హైదరాబాద్‌లో రెండేళ్లలో 565 పనిమనుషుల దొంగతనం కేసులు నమోదయ్యాయి. పోలీస్ వెరిఫికేషన్ లేని అపరిచితులను పనిలో పెట్టుకోవద్దని, డయల్ 100 లేదా వాట్సాప్ ద్వారా అప్రమత్తం చేయాలని సీపీ సజ్జానర్ సూచించారు.
Servant Theft Cases Hyderabad : హైదరాబాద్ నగరంలో ఇళ్లు, ఆఫీసులు, వ్యాపార సంస్థల్లో పనిమనుషుల అవతారంలో వచ్చి చోరీలకు పాల్పడుతున్న ముఠాల పట్ల సిటీ పోలీస్ యంత్రాంగం ప్రజలను తీవ్రంగా అప్రమత్తం చేస్తోంది. పనిమనుషులను చేర్చుకునేటప్పుడు యజమానులు చూపే చిన్నపాటి నిర్లక్ష్యమే నేరగాళ్లకు పెద్ద ఆసరాగా మారుతోందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తగిన ముందస్తు విచారణ, పూర్వాపరాలు తెలుసుకోకుండా పనిలో కుదుర్చుకుంటే కోట్లలో విలువైన సొత్తును పోగొట్టుకోవాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్నారు.

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పనుల ఒత్తిడిలో నిరంతరం బిజీగా ఉండే ఐటీ ఉద్యోగులు, ఒంటరిగా నివాసముండే వృద్ధులు, విద్యార్థులే ఈ చోరీలకు ప్రధాన బాధితులుగా మారుతున్నారు. ఇళ్లు, ఆఫీసులు, దుకాణాల్లో బంగారం, నగదు, అత్యంత విలువైన వస్తువులను నిర్లక్ష్యంగా బయట పడేసి వెళ్లడాన్ని గమనిస్తున్న కొందరు పనిమనుషులు సమయం చూసి చేతివాటం ప్రదర్శిస్తున్నారు.
యజమానులు చూపే ఈ అలసత్వమే నేరగాళ్లకు వరంగా మారుతోందని పోలీసులు విశ్లేషిస్తున్నారు. దొంగతనం జరిగిన తర్వాత దర్యాప్తు చేసి పట్టుకోవడం కంటే, అసలు నేరమే జరగకుండా ఆపడమే అత్యంత ముఖ్యమని పోలీసులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా స్వయంగా కాలనీలు, అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఆఫీసులు, దుకాణాలకు వెళ్లి యజమానులను నేరుగా కలిసి అవగాహన కల్పిస్తున్నారు.
565 కేసులు నమోదు : జూబ్లీహిల్స్ జోన్‌లోనే అత్యధికం
గత రెండేళ్లలో నగరంలో నమోదైన 565 పనిమనుషుల దొంగతనం కేసులను (65 గ్రేవ్ కేసులు, 500 నాన్ గ్రేవ్ కేసులు) విశ్లేషించిన పోలీసులు… ప్రతి యజమాని తక్షణమే భద్రతా నియమాలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జోన్ల వారీగా పరిణామాలు పరిశీలిస్తే ఐటీ సంస్థలు, వ్యాపార వర్గాలు, ఉన్నత నివాస ప్రాంగణాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో యజమానులు తగిన ముందస్తు తనిఖీలు లేకుండా పనిమనుషులను చేర్చుకుంటున్నట్లు తేలింది.
- జూబ్లీహిల్స్ జోన్: 173 కేసులు (అత్యధికం)
- సికింద్రాబాద్ జోన్: 88 కేసులు
- ఖైరతాబాద్ జోన్: 77 కేసులు
- గొల్కొండ జోన్: 70 కేసులు
- రాజేంద్రనగర్ జోన్: 63 కేసులు
- శంషాబాద్ జోన్: 49 కేసులు
- చార్మినార్ జోన్: 45 కేసులు
ముఖ్యంగా ఇటీవల ఇతర దేశాలు, రాష్ట్రాల మూలాలున్న ముఠాలు పనిమనుషుల అవతారంలో ఇళ్లలోకి ప్రవేశించి పథకం ప్రకారం దొంగతనాలకు, నేరాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తగిన గుర్తింపు, పోలీస్ వెరిఫికేషన్ పత్రాలు లేని అపరిచిత వ్యక్తులను పనిలో చేర్చుకోవద్దని పోలీసు యంత్రాంగం స్పష్టంగా సూచిస్తోంది. నమ్మకంగా పనిలో చేరిన కొత్తలో యజమానుల అలవాట్లు, తాళాలు ఉంచే ప్రదేశాలు, సీసీ కెమెరాల కదలికలు, నగదు-నగల వివరాలను గమనించి నేరాలకు పాల్పడుతున్నారు. పూర్వాపరాలు తెలియని వారిని ఇళ్లు, ఆఫీసులు, దుకాణాలకు రానివ్వకపోవడమే శ్రేయ్కరమని స్పష్టం చేస్తున్నారు.
పోలీసుల సూచనలు:
- ఎవరినైనా ఇంట్లో, ఆఫీసుల్లో, దుకాణాల్లో పనికి కుదుర్చుకునే ముందే వారి ఆధార్ కార్డు లేదా చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు నకలు, తాజా ఫోటో, శాశ్వత చిరునామా, స్వగ్రామం వివరాలు, ఫోన్ నంబర్లు తప్పనిసరిగా సేకరించాలి.
- ప్రైవేట్ ఏజెన్సీలు లేదా మధ్యవర్తుల ద్వారా నియామకాలు చేసుకునేటప్పుడు, సదరు ఏజెన్సీకి ప్రభుత్వ గుర్తింపు ఉందో లేదో సరిచూసుకోవాలి. గతంలో వారు ఎక్కడ పనిచేశారో ఆ యజమానులను సంప్రదించి వివరాలు ధ్రువీకరించుకోవాలి.
- నియామకానికి ముందే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఉచితంగా లభించే 'పోలీస్ వెరిఫికేషన్' చేయించుకోవడం అత్యంత శ్రేయస్కరం. పని చేసే వ్యక్తులు తమ వెంట గుర్తింపు కార్డు లేదా వెరిఫికేషన్ పత్రాన్ని ఉంచుకునేలా యజమానులే చొరవ తీసుకోవాలి.
- పనిలో చేరిన మొదటి 30 రోజుల పాటు వారి అలవాట్లు, కదలికలను నిశితంగా గమనించడం ద్వారా ఎలాంటి అనుమానాస్పద చర్యలనైనా ముందే గుర్తించవచ్చు.
- ఒంటరిగా ఉండే వృద్ధులు, తరచుగా ప్రయాణాలు చేసే కుటుంబాలు మరింత అప్రమత్తంగా ఉంటూ, ఇంట్లోని నగలు, డబ్బు, ప్రయాణ ప్రణాళికల గురించి పనిమనుషుల ముందు చర్చించకుండా జాగ్రత్త పడాలి.
- గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు సైతం తమ ప్రాంగణాల్లో ఇళ్లలో పనిచేసే పనిమనుషులకు ఎంట్రీ రిజిస్టర్లు నిర్వహిస్తూ ప్రవేశ పాస్‌లు ఇవ్వాలి. సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా పర్యవేక్షించాలి.
నివాసాలు, ఆఫీసులు, దుకాణాల్లో ఏమాత్రం అనుమానాస్పదంగా అనిపించినా, తాళం చెవులు పోయినా లేదా పనిమనిషి చెప్పకుండా మాయమైనా ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. అనుమానం వస్తే వెంటనే డయల్ 100కి గానీ, లేదా హైదరాబాద్ సిటీ పోలీస్ వాట్సాప్ హెల్ప్‌లైన్ నంబర్ 94906 16555 కు గానీ సమాచారం అందించవచ్చని తెలిపారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

