పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్‌కు లైంగిక వేధింపులు.. అసభ్యకరమైన మెసేజ్‌లు!
హైదరాబాద్ జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపాయి. ట్రైనీ మహిళా ఐపీఎస్ ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఒక షాకింగ్ ఘటన వెలుగుచూసింది. తోటి మహిళా ఐపీఎస్ ట్రైనీ ఆఫీసర్‌ను లైంగికంగా వేధించడంతో పాటు చంపేస్తానని బెదిరించిన ఆరోపణలపై ఒక ఐపీఎస్ ట్రైనీపై అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన పోలీస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

పోలీసుల కథనం ప్రకారం.. శివరాంపల్లిలోని నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఉదయ్ కృష్ణ రెడ్డి అనే ఐపీఎస్ ట్రైనీపై బాధితురాలు ఫిర్యాదు చేసింది. గత కొన్ని వారాలుగా నిందితుడు తనను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నట్లు సదరు ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిణి తన ఫిర్యాదులో పేర్కొ్న్నారు. జూన్ 23వ తేదీ నుండి ఈ వేధింపుల పర్వం మొదలైందని, రోజురోజుకూ నిందితుడి ప్రవర్తన మితిమీరిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
బాధితురాలు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయ్ కృష్ణ రెడ్డి ఆమెకు వాట్సాప్ ద్వారా తీవ్ర అసభ్యకరమైన, లైంగిక వేధింపులతో కూడిన సందేశాలను పంపేవాడు. అంతటితో ఆగకుండా, అకాడమీలోని ఇతర ట్రైనీల సమక్షంలో ఆమెను ఉద్దేశించి తెలుగులో అత్యంత అవమానకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ మానసిక క్షోభకు గురిచేసేవాడు.
మరో ట్రైనీ అధికారితో ఆమెకు అక్రమ సంబంధం ఉందంటూ నిందితుడు తప్పుడు ఆరోపణలు చేశాడని, ఆ ఆరోపణలను నిజమేనని ఒప్పుకోవాలంటూ తనపై నిరంతరం ఒత్తిడి తీసుకువచ్చాడని బాధితురాలు ఆరోపించారు. ఇందుకోసం ఆమెను తీవ్ర పదజాలంతో దూషించేవాడని పేర్కొన్నారు. దాదాపు పది రోజుల క్రితం, నిందితుడు ఆమెను భయపెట్టి, బ్లాక్‌మెయిల్ చేసి ఆమె వ్యక్తిగత మొబైల్ ఫోన్‌ను బలవంతంగా లాక్కున్నాడని తెలిపారు. దాని పాస్‌వర్డ్ చెప్పాలని ఒత్తిడి చేసి, ఆమె వ్యక్తిగత సందేశాలను చూశాడని చెప్పారు.
'జూలై 9వ తేదీ రాత్రి, నిందితుడు ఆమెను బలవంతంగా అడ్డుకుని, లాక్కుంటూ తన గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె జుట్టు పట్టుకుని లాగి, గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడు. అంతేకాకుండా మెడపై కత్తి పెట్టి గది నుంచి బయటకు వెళ్లకుండా నిర్బంధించాడు.' అని ఫిర్యాదులో పేర్కొన్నారు.
మరుసటి రోజు అంటే జూలై 10న కూడా నిందితుడు వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె ప్రమేయం, అనుమతి లేకుండా ఒక ప్రైవేట్ వీడియోను రహస్యంగా రికార్డ్ చేశాడు. ఆ వీడియోను బాధితురాలి భర్తకు పంపి, ఆమె ప్రతిష్టను భంగం కలిగిస్తానని, సమాజంలో తప్పుడు ప్రచారం చేస్తానని తీవ్రంగా బ్లాక్‌మెయిల్ చేశాడని ఫిర్యాదులో చెప్పారు.
బాధితురాలు ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్ పోలీసులు నిందితుడు ఉదయ్ కృష్ణ రెడ్డిపై లైంగిక వేధింపులు, శారీరక దాడి, క్రిమినల్ బెదిరింపులు, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు విచారణను ప్రారంభించారు. దేశంలోనే అత్యున్నత పోలీస్ శిక్షణా సంస్థలో ఇలాంటి ఘటన జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


