...
...
Next Story

Hyderabad Police : చైనా మాంజాపై స్పెషల్ ఫోకస్ - రూల్స్ బ్రేక్ చేసే కేసులు నమోదు

చైనా మాంజాపై హైదరాబాద్ నగర పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. దుకాణాల్లో అమ్మినా… కొనుగోలు చేసి వాడినా కేసులు నమోదు చేస్తున్నారు. ఇదే విషయంపై నగర సీపీ సజ్జనార్ ప్రకటన విడుదల చేశారు. పతంగుల జోరు.. ఇతరుల పాలిట యమపాశం కావొద్దని సూచించారు.

Published on: Jan 15, 2026, 11:23:02 IST
Advertisement

సంక్రాంతి వేళ పతంగుల జోరు కొనసాగుతోంది. అయితే చైనా మాంజా వాడకంపై హైదరాబాద్ నగర పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెడుతున్నారు. ఎక్కడైనా అమ్మినట్లు సమాచారం అందితే చాలు… కేసులు నమోదు చేసి అరెస్టులు కూడా చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సాధారణ దారాలను మాత్రమే వాడాలని…. చైనా మాంజాను వాడొద్దని స్పష్టం చేస్తున్నారు.

చైనా మాంజాపై స్పెషల్ ఫోకస్
చైనా మాంజాపై స్పెషల్ ఫోకస్

చైనా మాంజా విషయంపై హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ ప్రత్యేకంగా ప్రకటన విడుదల చేశారు. పతంగుల జోరు.. ఇతరుల పాలిట యమపాశం కావొద్దని సూచించారు. “సంక్రాంతి అంటేనే సంబరం. ఏడాదికోసారి వచ్చే ఈ పండుగ నాడు ఆకాశమంతా రంగురంగుల పతంగులు ఎగరేయడం మన ఆనవాయితీ. కానీ, కొందరి నిర్లక్ష్యం వల్ల ఈ పండుగ పక్షులకు, వాహనదారులకు శాపంగా మారుతోంది. పండుగ పూట మీకున్న ఆనందం.. ఇతరుల ఇంట విషాదం నింపకూడదు” అని కోరారు.

సంపూర్ణ నిషేధం ఉంది - సీపీ సజ్జనార్

“చైనా మాంజాపై సంపూర్ణ నిషేధం ఉంది. నైలాన్, గాజు పొడి అద్దిన సింథటిక్ దారాలను (చైనా మాంజా) అమ్మినా, కొన్నా, వాడినా చట్టం ఊరుకోదు. ఈ దారాలు పర్యావరణానికే కాదు.. పక్షుల పాలిట యమపాశంలా మారుతున్నయ్. రోడ్ల మీద పోయే బైకర్ల మెడకు మాంజా చుట్టుకొని గొంతు తెగిపోతున్న ఘటనలు చూస్తూనే ఉన్నం. మీ సరదా అమాయకుల ప్రాణాలను బలిగొనకూడదు” అని సజ్జనార్ పేర్కొన్నారు.

“కరెంట్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల కాడ పతంగులు ఎగరేయొద్దు. ఒకవేళ పతంగి కరెంట్ తీగల్లో ఇరుక్కుంటే.. ఇనుప రాడ్లతో గానీ, తడి చేతులతో గానీ లాగడానికి ట్రై చేయకండి. కరెంట్ షాక్ కొట్టి ప్రాణాలకే ముప్పు రావొచ్చు. జర భద్రం! పిట్టగోడలు (Parapets) లేని డాబాల మీద చిన్నపిల్లలను ఒంటరిగా పతంగులు ఎగరేయనివ్వొద్దు. పతంగి ద్యాసలో పడి పిల్లలు కిందపడే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులు పిల్లలను ఓ కంట కనిపెట్టుకుని ఉండాలి” అని తల్లిదండ్రులకు సీపీ సజ్జనార్ సూచించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks