'నా ఆటో ఇచ్చేస్తారా? లేదంటే పామును మీద వేయాలా?' డ్రంక్ అండ్ డ్రైవ్‌లో వ్యక్తి హల్‌చల్

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఓ ఆటో డ్రైవర్ హల్‌చల్ చేశాడు. తాగి ట్రాఫిక్ పోలీసులకు చిక్కడమే కాకుండా.. తన ఆటోను ఇవ్వాలని లేదంటే.. పామును మీద వదిలేస్తా అని బెదిరించాడు.

Published on: Jan 5, 2026, 09:27:08 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

డ్రంక్ డ్రైవ్ సందర్భంగా తాగుబోతులు చేసే పనులు ఎంత వింతగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా హైదరాబాద్‌లో ఓ వ్యక్తి ఇలాగే హల్‌చల్ చేశాడు. పామును చూపిస్తూ.. ట్రాఫిక్ ఎస్సైని భయపెట్టించే ప్రయత్నం చేశాడు. తనపై కేసు నమోదు చేయవద్దని, తన ఆటోను ఇచ్చేయాలని బెదిరించాడు.

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో వ్యక్తి హల్‌చల్
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో వ్యక్తి హల్‌చల్

శనివారం రాత్రి హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లు చేస్తున్నారు పోలీసులు. ఇదే సమయంలో చాంద్రాయణగుట్ట ప్రాంతంలో ట్రాఫిక్ ఎస్సై ఎం.ఎ కరీం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు. ఆటో డ్రైవర్ సయ్యద్ ఇర్ఫాన్ మద్యం మత్తులో ఉన్నాడని అనుమానించిన ట్రాఫిక్ పోలీసు అధికారులు అతన్ని ఆపారు. డ్రైవర్‌కు బ్రీత్ అనలైజర్ పరీక్షలో 110 రీడింగ్ వచ్చింది. అతనిపై కేసు నమోదు చేశారు. ఆటోను స్వాధీనం చేసుకున్నారు.

ఇక ఇర్ఫాన్ తన హంగామా మెుదలుపెట్టాడు. మెుదటగా కేసు వద్దని, ఆటోను సీజ్ చేయకూడదని అడిగాడు. అప్పటికే పోలీసులు తమ పనిలో తాము ఉన్నారు. పోలీసులు డ్రైవర్‌ను వాహనం నుండి తన వస్తువులను బయటకు తీయమని చెప్పారు. అయితే వెంటనే ఇర్ఫాన్ ఆటోలో నుంచి ఓ పామును బయటకు తీశాడు. కేసు నమోదు చేయవద్దని, తన ఆటోను విడుదల చేయమని డిమాండ్ చేశాడు.

ట్రాఫిక్ పోలీసు అధికారి వద్దకు వెళ్లి తన మణికట్టుకు చుట్టుకున్న పామును విప్పుతూ ఆ అధికారిని బెదిరించాడు. ఆటో ఇచ్చేస్తారా..మీద పామును వేయమంటారా? అని ట్రాఫిక్ ఎస్సైతో వాగ్వాదానిగి దిగాడు. పామును చేతికి చుట్టుకుంటూ.. విప్పుతూ నానా హంగామా చేశాడు.

ఆశ్చర్యపోయిన అధికారి ఆటో డ్రైవర్ ఇర్ఫాన్‌ను తోసేసాడు, డ్రైవర్ మళ్ళీ రోడ్డు మీదకు వచ్చి పామును తన మణికట్టుకు చుట్టుకున్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ట్రాఫిక్ ఎస్సై ఫిర్యాదుతో పోలీసులు ఆటో డ్రైవర్ ఇర్ఫాన్‌పై కేసు నమోదు చేశారు. అతడిని అరెస్ట్ చేశారు. మద్య మత్తులో అలా చేశానని, అది చనిపోయిన పాము అని తెలిపాడు. తన అక్కలను ఆటపట్టించడానికి దారిలో చనిపోయిన పాము దొరికితే.. తీసుకొచ్చానని వెల్లడించాడు.

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ పోలీసులు భద్రతా తనిఖీలు ముమ్మరం చేసిన నేపథ్యంలో ఈ సంఘటన జరిగింది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మూడు కమిషనరేట్లలో మద్యం సేవించి వాహనం నడిపినందుకు అధికారులు మొత్తం 2,731 మంది డ్రైవర్లపై అభియోగాలు మోపారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 1,198, సైబరాబాద్‌లో 928, రాచకొండ (మల్కాజ్‌గిరి)లో 605 మంది ఉన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More