...
...
Next Story

MMTS Free : ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఎంఎంటీఎస్‌ రైలులో అందరికీ ఉచిత ప్రయాణం!

MMTS Free : హైదరాబాద్ వాసులకు ప్రభుత్వం త్వరలో శుభవార్త అందించనుంది. ఎంఎంటీఎస్ రైలులో ప్రయాణించేవారికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనుందని తెలుస్తోంది.

Published on: Apr 19, 2026, 08:45:07 IST
Advertisement

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ, కాలుష్యాన్ని తగ్గించాలని తెలంగాణ ప్రభుత్వం అనుకుంటోంది. అందుకే పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా జూన్ 2 నుంచి హైదరాబాద్ మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ (MMTS) రైళ్లలో ఉచిత ప్రయాణాన్ని ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా ప్రయాణికులందరికీ ఒక సంవత్సరం పాటు ప్రయోగాత్మకంగా అమలు చేయాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు ప్రారంభించి, ఆ తర్వాత దాని పనితీరు, ఫలితాల ఆధారంగా సమీక్షించనున్నారు.

ఎంఎంటీఎస్‌లో ఉచిత ప్రయాణం
ఎంఎంటీఎస్‌లో ఉచిత ప్రయాణం

ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపినట్లు సమాచారం. ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో సహా సీనియర్ అధికారులు ఇటీవల ఈ ప్రణాళికపై చర్చించేందుకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో సమావేశమయ్యారు. ప్రయాణికుల సంఖ్యలో మార్పులు వచ్చినా రాకపోయినా, ఎంఎంటీఎస్ సేవల ద్వారా ప్రస్తుతం వస్తున్న సుమారు రూ.10 కోట్ల వార్షిక ఆదాయాన్ని రైల్వేకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారంగా చెల్లిస్తుందని స్పష్టం చేసింది.

ప్రస్తుతం ఎంఎంటీఎస్ సర్వీసులు రోజుకు సుమారు 38,000 నుండి 42,000 మంది ప్రయాణికులను తీసుకువెళ్తున్నాయి. కోవిడ్‌కు ముందు 121 రోజువారీ సర్వీసులను 1.2 లక్షల మందికి పైగా ప్రయాణికులు ఉపయోగించుకునేవారు. దానితో పోలిస్తే ఈ సంఖ్య గణనీయంగా తక్కువ. ప్రస్తుతం, కేవలం 80 నుంచి 88 రైలు సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయి. రైళ్ల రాకపోకల సంఖ్య తగ్గడం, సమయపాలన సరిగ్గా లేకపోవడం వంటివి ప్రయాణికుల సంఖ్యపై ప్రభావం చూపాయని అధికారులు చెబుతున్నారు.

మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖకు చెందిన ఉన్నతాధికారులు కూడా దక్షిణ మధ్య రైల్వేకు లేఖ రాశారు. రద్దీ సమయాల్లో రైళ్ల రాకపోకలను మెరుగుపరచాలని, సమయపాలనను మెరుగుపరచాలని, స్టేషన్ సౌకర్యాలను ఉన్నతీకరించాలని, ఆర్టీసీ షటిల్ బస్సుల ద్వారా చివరి మైలు కనెక్టివిటీ కల్పించాలని కోరారు. ఇందుకోసం స్టేషన్లలో స్థలాన్ని కేటాయించాలని కూడా అభ్యర్థించారు.

ఇక ప్రస్తుతం అందరికీ ఫ్రీ ఎంఎంటీఎస్ ప్రయాణంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దీనిపై అధికారులు కూడా చర్చలు చేస్తున్నారు. అమలుకు ముందు రైల్వే బోర్డు నుండి తుది ఆమోదం ఇంకా రావలసి ఉంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks