హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 నుంచి వరంగల్ ఎయిర్‌పోర్ట్ వరకు.. ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి విజ్ఞప్తులు

ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. రాష్ట్రానికి ప్రాజెక్టులపై చర్చించారు. వాటి అవసరం తెలంగాణకు ఎంత ముఖ్యమో వివరించారు.

Updated on: Jun 12, 2026, 05:38:28 IST
By , Delhi
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులపై కేంద్రం సహకారం అందించాలని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. సాగు, తాగునీటి అవసరాల దృష్ట్యా గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకునేలా మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర భవిష్యత్తు అవసరాలకు గోదావరి జలాల వినియోగం అత్యంత ముఖ్యమని చెప్పారు. నీతి ఆయోగ్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలిసి హైదరాబాద్ మెట్రో ఫేజ్‌-2 విస్తరణతోపాటు పలు ప్రతిపాదనలను అందించారు.

ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి

మెట్రో ఫేజ్‌-2లో 7 కారిడార్లలో 122.9 కిలోమీటర్ల మెట్రో విస్తరణకు రూ.38,595 కోట్ల ప్రతిపాదనలు సమర్పించినట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్‌ వెంచర్‌గా మంజూరు చేయాలని కోరారు.

హైదరాబాద్ రీజినల్‌ రింగ్‌ రోడ్డు పనులకు వెంటనే ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి కోరారు. ఉత్తర భాగంలో భూసేకరణ ఖర్చులో 50 శాతం వాటా భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించిందని గుర్తుచేస్తూ, ఎన్‌హెచ్‌ఏఐకి రూ. 626 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. ఉత్తర భాగానికి సంబంధించి 90 శాతానికి పైగా భూసేకరణ అవార్డు పూర్తయిందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం నిర్మాణం కూడా తెలంగాణ రాష్ట్రానికి అంతే కీలకమని ముఖ్యమంత్రి వివరించారు. చౌటుప్పల్‌ నుంచి సంగారెడ్డి వరకు దక్షిణ కారిడార్‌ నిర్మాణం పూర్తయితే హైదరాబాద్‌ చుట్టూ రవాణా వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని తెలిపారు.

దక్షిణ భాగానికి సంబంధించిన అలైన్‌మెంట్‌ మ్యాపులు, హెచ్ఎండీఏ మాస్టర్‌ ప్లాన్‌ నోటిఫికేషన్లను ఇప్పటికే కేంద్ర రోడ్డు రవాణా శాఖకు అందించామని, ఉత్తర, దక్షిణ కారిడార్లను ఒకేసారి ఆమోదించి అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

'హైదరాబాద్‌ – అమరావతి – బందర్‌ పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌వేకు కేంద్రం అనుమతి ఇవ్వాలి. హైదరాబాద్‌ నుంచి అమరావతి మీదుగా బందర్‌ పోర్టును కలిపే 12 లేన్ల ఎక్స్‌ప్రెస్‌వే తెలంగాణకు వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుంది. 120 మీటర్ల రైట్‌ ఆఫ్‌ వే తో ప్రతిపాదించిన ఈ హైవే ద్వారా సముద్ర తీరం లేని తెలంగాణకు పోర్ట్‌ కనెక్టివిటీ లభిస్తుంది. ఫార్మా, ఎలక్ట్రానిక్స్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాల ఎగుమతులకు ఇది కీలక మార్గంగా నిలుస్తుంది.' అని ప్రధానమంత్రికి రేవంత్ రెడ్డి వివరించారు.

వరంగల్ ఎయిర్‌పోర్ట్‌ పనులను ప్రారంభించాలన్న అంశాన్ని డా ముఖ్యమంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. “వరంగల్ విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణ ఇప్పటికే పూర్తిచేసి ఎయిర్ పోర్ట్ అథారిటీకి అప్పగించాం. వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌ అందుబాటులోకి వస్తే ఉత్తర తెలంగాణ పారిశ్రామిక, విద్యా, పర్యాటక రంగాలకు మరింత ప్రయోజనం చేకూరుతుంది” అని సీఎం చెప్పారు.

హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఐఐఎంకు అవసరమయ్యే 200 ఎకరాల స్థలం కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణలో ఇప్పటికే ఐఐటీ, ఐఐఐటీ, నల్సార్‌, టీఐఎఫ్‌ఆర్‌ వంటి ప్రముఖ జాతీయ విద్యాసంస్థలున్నాయని గుర్తు చేశారు. ఐఐఎం ఏర్పాటు చేస్తే నూతన విద్యావిధానం-2020 ఆశించిన లక్ష్యం కూడా నెరవేరుతుందని ప్రధానమంత్రికి రేవంత్ రెడ్డి వివరించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More