న్యూ ఇయర్ వేళ పోలీసుల అలర్ట్ - ఈ వారమంతా 'డ్రంక్ అండ్ డ్రైవ్'పై స్పెషల్ ఫోకస్ - పట్టుబడితే జైలుకే...!
న్యూ ఇయర్ వేడుకలపై హైదరాబాద్ పోలీసులు నజర్ పెట్టారు. హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని నగర సీపీ సజ్జనార్ హెచ్చరించారు. మోతాదు మించి తాగి వాహనాలు నడిపితే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు.
నూతన సంవత్సర వేడుకల పేరుతో రోడ్లపై హంగామా సృష్టిస్తూ, హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. తాగి వాహనాలు నడిపే వారిపై బుధవారం నుంచి న్యూ ఇయర్ రోజు వరకు నగరవ్యాప్తంగా స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు నగర సీపీ సజ్జనార్ వివరాలను వెల్లడించారు.

బంజారాహిల్స్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(టీజీఐసీసీసీ) లో మంగళవారం క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల బందోబస్తుపై సీపీ సజ్జనార్ సమీక్షించారు. భద్రతా ఏర్పాట్లపై ఆయన కీలక సూచనలు చేశారు.
క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. హాట్ స్పాట్లు, గతంలో నేరాలు జరిగిన ప్రాంతాల్లో సిబ్బందిని మోహరించాలని, పాత నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు…
డిసెంబరు 31 రాత్రి నగరవ్యాప్తంగా 100 ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని సీపీ తెలిపారు. ఇందుకోసం 7 ప్లాటూన్ల అదనపు బలగాలను రంగంలోకి దించుతున్నామన్నారు. కొత్త సంవత్సరం జోష్‌లో మోతాదు మించి తాగి వాహనాలు నడిపితే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడితే వాహన సీజ్‌తో పాటు రూ.10 వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.
డ్రైవింగ్ లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేసే అవకాశం కూడా ఉందన్నారు. పార్టీలకు వెళ్లేవారు ముందుగానే 'డెసిగ్నేటెడ్ డ్రైవర్'ను ఏర్పాటు చేసుకోవాలని లేదా క్యాబ్‌లను ఆశ్రయించాలని సూచించారు. యువత రోడ్లపై రేసింగ్‌లు, వీలింగ్‌లు, ర్యాష్ డ్రైవింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
2026 స్వాగత వేడుకలు ప్రజల జీవితాల్లో తీపి జ్ఞాపకాలుగా మిగలాలే తప్ప, చేదు అనుభవాలుగా మారకూడదని సీపీ సజ్జనార్ హితవు పలికారు. డిసెంబరు 31 రాత్రి పబ్‌లు, త్రీస్టార్, ఆపై స్థాయి హోటళ్లలో జరిగే వేడుకలకు అర్ధరాత్రి 1 గంట వరకే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.
శబ్ద కాలుష్య నిబంధనలు కచ్చితంగా పాటించాలని, డెసిబెల్స్ పరిమితి దాటితే సౌండ్ సిస్టమ్‌లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈవెంట్లలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం జరిగినా, అశ్లీల నృత్యాలకు తావిచ్చినా యాజమాన్యాలదే పూర్తి బాధ్యత అని, అలాంటి వారి లైసెన్సులు రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.
వేడుకల్లో మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు సీపీ వివరించారు. రద్దీగా ఉండే ప్రాంతాలు, పార్టీ వెన్యూలు, జంక్షన్‌లలో మఫ్టీలో 15 షీ టీమ్స్ నిఘా ఉంచుతాయని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే తక్షణమే అరెస్టు చేస్తామని వెల్లడించారు. ప్రజలు చట్టాన్ని గౌరవిస్తూ, సురక్షితంగా 2026కు స్వాగతం పలకాలని కోరారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

