న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ పోలీసుల కఠినమైన మార్గదర్శకాలు.. ఫాలో కావాల్సిందే!

హైదరాబాద్‌లో నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా, నిబంధనలకు అనుగుణంగా జరిగేలా సిటీ పోలీసులు మార్గదర్శకాలను విడుదల చేశారు. త్రీస్టార్ హోటల్స్, పబ్స్, క్లబ్స్ యాజమాన్యాలకు ఈ రూల్స్ తప్పనిసరిగా వర్తిస్తాయి.

Published on: Dec 14, 2025, 15:36:31 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

డిసెంబర్ 31, 2025, జనవరి 1, 2026 మధ్య రాత్రి నూతన సంవత్సర వేడుకలను ప్లాన్ చేస్తున్న త్రీస్టార్, అంతకంటే ఎక్కువ హోటళ్ళు, క్లబ్బులు, బార్లు, రెస్టారెంట్లు, పబ్‌ల నిర్వహణకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వివరణాత్మక మార్గదర్శకాలను జారీ చేశారు. తెల్లవారుజామున ఒంటి గంట వరకు టిక్కెట్లు ఉన్న కార్యక్రమాలు లేదా కార్యక్రమాలను నిర్వహించాలనుకునే సంస్థలు కనీసం 15 రోజుల ముందుగానే అనుమతి కోసం పోలీస్ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకోవాలి. నిర్వాహకులు అన్ని భద్రత, శాంతిభద్రతలు, ట్రాఫిక్, మర్యాద నిబంధనలను కచ్చితంగా పాటించాలని పోలీసులు ఆదేశించారు.

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ 2026
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ 2026

సీసీటీవీ, భద్రత, సామర్థ్య నిబంధనలు

నిర్వాహకులు అన్ని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద, అలాగే పార్కింగ్ ప్రదేశాలలో రికార్డింగ్ సౌకర్యాలతో కూడిన సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ నిర్వహణ, యాక్సెస్ నియంత్రణ కోసం తగినంత భద్రతా సిబ్బందిని నియమించాలి. చట్టపరమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. సామర్థ్యానికి మించి పాస్‌లు, టిక్కెట్లు లేదా కూపన్‌లను జారీ చేయవద్దని నిర్వాహకులను హెచ్చరించారు. ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించకుండా వేదిక లోపల సరైన పార్కింగ్ ఏర్పాట్లు తప్పనిసరి చేయాలి.

ధ్వని పరిమితులు, మద్యం నియమాలు

డీజేలు, లౌడ్‌స్పీకర్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌లతో సహా బహిరంగ సౌండ్ సిస్టమ్‌లను రాత్రి పది గంటల సమయానికి ఆపేయాలి. ఇండోర్ సౌండ్ సిస్టమ్‌లు విందు లేదా ఫంక్షన్ హాళ్లు వంటి ఇండోర్ వవేడుకల ప్రాంగణంలో రాత్రి పది గంటల నుంచి ఒంటి గంట వరకు 45 డెసిబుల్స్ మించకుండా సౌండ్ అనుమతి ఇచ్చారు. ఈవెంట్ వేదికలలో తుపాకీలను అనుమతించవద్దని, ప్రదర్శనలలో అశ్లీలత లేదా నగ్నత్వం ఉండకూడదని, బాణసంచా ప్రదర్శన లేదా వాడకాన్ని నిషేధించాలని నిర్వాహకులను ఆదేశించింది పోలీస్ శాఖ. ఎక్సైజ్ శాఖ అనుమతించిన గంటలకు మించి మద్యం అందించకూడదు.

తాగిన మత్తులో ఉన్న కస్టమర్‌ల కోసం డ్రైవర్లు లేదా క్యాబ్‌లను ఏర్పాటు చేయడం, వారు సురక్షితంగా ఇంటికి చేరుకునేలా చూసుకోవడం కూడా పబ్‌లు, బార్‌లపై బాధ్యత ఉంది. జిల్లా అగ్నిమాపక అధికారి లేదా ప్రాంతీయ అగ్నిమాపక అధికారి జారీ చేసిన సూచనలను పాటించాలి. ప్రాణాలకు, ఆస్తికి ఏదైనా నష్టం, ఇబ్బంది కలిగితే దానికి దరఖాస్తుదారుడే బాధ్యత వహించాలి.

మాదకద్రవ్యాలు, మైనర్లకు అనుమతి లేదు

ఈవెంట్ల దగ్గర మాదకద్రవ్యాలు లేదా సైకోట్రోపిక్ పదార్థాల వాడకం లేదా అమ్మకాలకు వ్యతిరేకంగా పోలీసులు కఠినమైన హెచ్చరిక జారీ చేశారు. అటువంటి కార్యకలాపాలను నిరోధించడంలో విఫలమైతే నిర్వహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. పార్కింగ్ ప్రాంతాలు, ఇతర ప్రదేశాలలో ప్రత్యేక నిఘా ఉంచాలి. పబ్‌లు, బార్‌లలో నిర్వహించే కార్యక్రమాలలో మైనర్లను అనుమతించకూడదు. ప్రాంగణంలో పార్కింగ్‌ను నియంత్రించడానికి, ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల వద్ద ట్రాఫిక్‌ను నిర్వహించడానికి నిర్వాహకులు తగినంత భద్రతా సిబ్బందిని నియమించాలి.

తాగి వాహనం నడపకూడదు

అన్ని స్టార్ హోటళ్లు, పబ్‌లు, క్లబ్‌లు, బార్‌లు, రెస్టారెంట్‌లు ప్రవేశ ద్వారాల వద్ద, లోపల వివరణాత్మక సలహాను ప్రముఖంగా ప్రదర్శించాలి. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 185 ప్రకారం మద్యం సేవించి వాహనం నడపడం నేరం. నేరస్థులకు రూ.10,000 జరిమానా, లేదా ఆరు నెలల జైలు శిక్ష, మూడు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం లేదా శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు ఉంటుందని పోలీసులు తెలిపారు.

మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు నడిపే వాహనాలను స్వాధీనం చేసుకుని, తగిన ప్రక్రియ తర్వాత మాత్రమే విడుదల చేస్తారు. అతి వేగం, ప్రమాదకరమైన డ్రైవింగ్, రేసింగ్‌లకు వ్యతిరేకంగా కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా నగరం అంతటా షీ టీమ్ బృందాలు ఉంటాయి. మహిళలపై నేరాలను ఉపేక్షించేది లేదని పోలీసులు హెచ్చరించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More