...
...
Next Story

హైదరాబాద్ vs బెంగళూరు: ఐదు నెలల అనుభవంపై నెటిజన్ నిజాయితీ రివ్యూ

ఐదు నెలల క్రితం బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు మారిన ఒక నెటిజన్ రెండు నగరాల మధ్య వ్యత్యాసాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. కరెంట్ కోతలు, రోడ్లు, ట్రాఫిక్, ఆహారం వంటి అంశాలపై ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

Published on: Jun 22, 2026 04:24 PM IST
Advertisement

ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఐటీ నగరాలు హైదరాబాద్, బెంగళూరుల మధ్య పోలిక ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ఐదు నెలల క్రితం బెంగళూరును వీడి భాగ్యనగరానికి మారిన ఒక వ్యక్తి.. ఈ రెండు నగరాల జీవన విధానంపై చేసిన విశ్లేషణ ఇప్పుడు సోషల్ మీడియా వేదిక రెడిట్ (Reddit) లో హాట్ టాపిక్‌గా మారింది. విద్యుత్ సరఫరా, రోడ్ల పరిస్థితి, వాతావరణం, ట్రాఫిక్, స్థానిక ప్రజల ప్రవర్తన వంటి పలు అంశాలపై అతను తన అనుభవాలను పంచుకున్నారు.

కరెంట్ కోతలు.. తట్టుకోలేని వేడి

హైదరాబాద్ vs బెంగళూరు: ఐదు నెలల అనుభవంపై నెటిజన్ నిజాయితీ రివ్యూ
హైదరాబాద్ vs బెంగళూరు: ఐదు నెలల అనుభవంపై నెటిజన్ నిజాయితీ రివ్యూ

హైదరాబాద్‌లో గడిపిన కాలం తనకు విద్యుత్ లేకపోతే జీవితం ఎంత నరకంగా ఉంటుందో నేర్పిందని సదరు నెటిజన్ పేర్కొన్నారు. "వేసవిలో ఇక్కడ కరెంట్ కోతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నా గదిలో ఏసీ లేకపోతే ఉక్కపోతకు చనిపోతానేమో అన్నంత భయం వేసింది" అని అతను తన ఆవేదనను పంచుకున్నారు. వేసవి కాలంలో హైదరాబాద్ కంటే బెంగళూరు వాతావరణమే ఎంతో ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

గుంతల బెంగళూరు.. మ్యాన్‌హోల్స్ హైదరాబాద్

ఇరు నగరాల మౌలిక సదుపాయాలను పోలుస్తూ రోడ్ల పరిస్థితిని వివరించారు. "హైదరాబాద్ రోడ్లపై పెద్దగా గుంతలు కనిపించవు కానీ సరిగ్గా మూతల్లేని మ్యాన్‌హోల్స్ దర్శనమిస్తాయి. రోడ్డుపై కాస్త శ్రద్ధ పెట్టకపోతే ఈ సగం తెరిచిన మ్యాన్‌హోల్స్ వల్ల నేరుగా ఆసుపత్రి పాలవ్వాల్సి వస్తుంది" అని హెచ్చరించారు.

బెంగళూరులో గుంతలు ఎక్కువే అయినా, అవి ప్రాణాల మీదికి తెచ్చేంత ప్రమాదకరంగా ఉండవని అభిప్రాయపడ్డారు.

ఫుడ్ అదరహో.. ట్రాఫిక్ బెటర్

ఆహారం విషయంలో మాత్రం హైదరాబాద్‌కు తిరుగులేదని నెటిజన్ ప్రశంసలు కురిపించారు. బెంగళూరు భోజనంతో హైదరాబాద్ వంటకాలకు అస్సలు పోలికే లేదని, అయితే ఇక్కడి ఆహారం కొంచెం ఘాటుగా (స్పైసీగా) ఉంటుందని చెప్పారు. ఇక్కడి ప్రజలు ఎంతో స్నేహపూర్వకంగా ఉంటారని, అందరికీ హిందీ బాగా అర్థమవుతుందని పేర్కొన్నారు. అయితే బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్‌లో ఇంగ్లీష్ మాట్లాడేవారి సంఖ్య కొంచెం తక్కువని అభిప్రాయపడ్డారు.

నెటిజన్ల భిన్నమైన స్పందనలు

"హైదరాబాద్ vs బెంగళూరు" పేరుతో ఉన్న ఈ పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "మీరు వాతావరణం చాలా అధ్వాన్నంగా ఉన్న సమయంలో హైదరాబాద్ వచ్చారు. నేను గత 30 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాను, ఇంతటి దారుణమైన వేసవిని ఎప్పుడూ చూడలేదు" అని ఒక పాత హైదరాబాద్ వాసి కామెంట్ చేశారు.

"మనం ఏ నగరంలో ఉంటున్నామనే దానికంటే ఆ నగరంలో ఏ ప్రాంతంలో నివసిస్తున్నామనే దానిపైనే మన అనుభవాలు ఆధారపడి ఉంటాయి" అని మరొకరు అభిప్రాయపడ్డారు.

"నాకు హైదరాబాద్ అంటే ప్రాణం. భారతదేశంలో నివసించడానికి ఇది అత్యుత్తమ నగరం, కానీ ఎంతమంది మంచి వ్యక్తులు ఉన్నా ఇక్కడ ఒంటరితనం వెంటాడుతూనే ఉంటుంది" అని ఇంకొక నెటిజన్ తన భావాలను పంచుకున్నారు.

భారతదేశంలోని మెట్రో నగరాల్లో జీవన ప్రమాణాలు పడిపోతున్నాయని, అయితే అన్నింటికంటే మంచి మనసున్న ప్రజలున్న హైదరాబాద్ ఎంతో మెరుగైనదని మెజారిటీ నెటిజన్లు వ్యాఖ్యానించారు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe