HYDRAA Ranganath : వాళ్లందరికీ అడ్డు పడడటమే నేను చేసిన తప్పు... చట్టపరంగానే ఎదుర్కొంటాను - హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌

HYDRAA Commissioner Ranganath : రాజ్యాంగబద్ధంగానే చెరువులు, ప్రభుత్వ ఆస్తులను కాపాడుతున్నానని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. భూమాఫియా కుట్రల వల్లే తనపై 63 కోర్టు ధిక్కార కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.

Published on: Jul 28, 2026, 05:12:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్‌లోని చెరువులు, పార్కులు, వేల ఎకరాల ప్రభుత్వ భూములను కాపాడే ప్రక్రియలో తాము పూర్తి రాజ్యాంగ స్ఫూర్తితో ముందడుగు వేస్తున్నామని హైడ్ కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 48A కల్పిస్తున్న హక్కులు, బాధ్యతల ప్రకారమే ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని ఆయన వెల్లడించారు.

హైడ్రా కమిషనర్ రంగనాథ్
హైడ్రా కమిషనర్ రంగనాథ్

గడిచిన రెండేళ్ల కాలంలో ల్యాండ్ మాఫియా, భూకబ్జాదారుల బారి నుంచి సుమారు రూ. 1.50 లక్షల కోట్ల (17 బిలియన్ డాలర్లు) విలువైన ప్రభుత్వ ఆస్తులను హైడ్రా స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి అప్పగించింది. ఆక్రమణల చెరలో ఉన్న వందలాది చెరువులు, పార్కులకు విముక్తి కల్పించడమే కాకుండా, ఆరు చెరువులను ఇప్పటికే పూర్తి స్థాయిలో పునరుద్ధరించామని ఆయన తెలిపారు. మరో 20 చెరువుల పునరుద్ధరణ పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయని చెప్పారు.

కబ్జాదారులు వేసిన కేసులే!

తమపై వస్తున్న కోర్టు ధిక్కార కేసుల వార్తలపై రంగనాథ్ తీవ్రంగా స్పందించారు. "నాపై ప్రస్తుతం 63 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. అయితే ఈ కేసులు వేసింది ఎవరో ప్రజలు గ్రహించాలి. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు, సామాన్యుల ప్లాట్లను మింగేయాలని చూసిన బడా భూకబ్జాదారులు, ల్యాండ్ మాఫియా మాత్రమే ఈ కేసులు వేశాయి," అని ఆయన బహిరంగంగా వ్యాఖ్యానించారు.

భూమాఫియా తప్పుడు సమాచారంతో న్యాయస్థానాలను సైతం తప్పుదోవ పట్టిస్తోందని రంగనాథ్ చెప్పారు. చట్టాలు, న్యాయస్థానాలపై తనకు పూర్తి నమ్మకం ఉందని…. ఈ కేసులన్నింటినీ చట్టపరంగానే ఎదుర్కొంటానని ధీమా వ్యక్తం చేశారు.

సికింద్రాబాద్ సమీపంలోని లోతుకుంట ప్రాంతంలో దాదాపు రూ. 10,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు శాంతా శ్రీరామ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కుట్ర చేసిందని రంగనాథ్ వెల్లడించారు. ఎక్కడో మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న భూమిని చూపిస్తూ, అసలు ఉనికిలోనే లేని ఆధారాలతో 120 ఎకరాల ప్రభుత్వ భూమిలోకి అక్రమంగా ప్రవేశించారని పేర్కొన్నారు.

ఎలాంటి అనుమతులు లేకుండా…. సుమారు 2500 ఏళ్ల చరిత్ర కలిగిన హెరిటేజ్ గుట్టలను బ్లాస్టింగ్ చేస్తూ, వందలాది చెట్లను నరికివేసి విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు. 'సేవ్ ది రాక్స్ సొసైటీ', పర్యావరణ వేత్తలు, స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే హైడ్రా రంగంలోకి దిగి చర్యలు తీసుకుందని వివరించారు.

అడ్డుపడటమే నేను చేసిన తప్పు - రంగనాథ్

“వేల కోట్ల విలువైన సామాన్యుల ప్లాట్స్, ప్రభుత్వ భూములు ఆక్రమించిన ముఖీం.. వీరందరికీ నేను హైడ్రా కమిషనర్ గా అడ్డు పడడటమే నేను చేసిన తప్పు. వీళ్ళు అందరూ వేసిన కేసులే నా మీద ఉన్న 63 కోర్టు ధిక్కార కేసులు. వాటిని నేను చట్ట పరంగానే ఎదుర్కుంటాను. నాకు న్యాయస్థానాలు అంటే పూర్తి నమ్మకం. చ‌ట్టాల ప‌ట్ల గౌర‌వంతో ప‌ని చేస్తూ వ‌స్తున్నాను. గతంలో, ఇప్పుడు, మున్ముందు ప్ర‌భుత్వాలు ఏ బాధ్యతలు అప్పగించినా నేను నా వైపు నుంచి 100 శాతం ఫ‌లితాలు ఇవ్వట‌మే ల‌క్ష్యంగా ఉంటాను. అలాగే పని చేస్తున్నాను, భ‌విష్యత్తులో కూడా అదే నిబ‌ద్ధ‌త‌తో ప‌ని చేస్తాను” అని రంగనాథ్ ఓ ప్రకటన విడుదల చేశారు.

అంతకంటే ముందు హైడ్రా కమిషనర్‌ పోస్టు నుంచి తప్పించాలని సీఎస్‌ను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. రంగనాథ్‌పై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయని ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులను ఆశ్రయించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని స్పష్టం చేసింది. ఉన్నతాధికారిగా ఉన్న రంగనాథ్‌.. కోర్టు ఉత్తర్వులను ఇన్నిసార్లు ధిక్కరించడం సరికాదని ఆక్షేపించింది. ఈ నేపథ్యంలో రంగనాథ్ స్పందిస్తూ…. ప్రకటన విడుదల చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More