హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి రంగనాథ్‌ను తక్షణమే తొలగించండి : తెలంగాణ హైకోర్టు

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌పై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి తప్పించాలని ఆదేశించింది.

Published on: Jul 27, 2026, 16:13:28 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి వెంటనే తప్పించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. నిర్ణీత గడువులోగా క్షమాపణతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయనందున, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను తక్షణమే మార్చాలని తెలంగాణ హైకోర్టు సీఎస్‌ను ఆదేశించింది. లోతుకుంటకు సంబంధించిన భూ వివాదం కేసు విచారణ సందర్భంగా ఈ ఆదేశం వెలువడింది.

తెలంగాణ హైకోర్టు
తెలంగాణ హైకోర్టు

లోతుకుంటలోని భూ వివాదానికి సంబంధించిన పిటిషన్‌ను విచారిస్తున్న సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను తక్షణమే మార్చాలని హైకోర్టు సీఎస్‌ని ఆదేశించింది. గతంలో సోమవారం లోగా లిఖితపూర్వక అఫిడవిట్ ద్వారా క్షమాపణ చెప్పాలని తెలంగాణ హైకోర్టు రంగనాథ్‌ను ఆదేశించింది. అయితే హైడ్రా తరఫు న్యాయవాది, క్షమాపణకు బదులుగా త్వరలో ఒక పిటిషన్ దాఖలు చేయనున్నట్లు కోర్టుకు తెలియజేశారు. అడ్వకేట్ జనరల్ జోక్యం తర్వాత, అఫిడవిట్ దాఖలు చేయడం కోసమే ప్రత్యేకంగా సోమవారం వరకు సమయం ఇచ్చారని గుర్తుచేస్తూ, ఈ వాదనను కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఏవీ రంగనాథ్‌ను హైడ్రా చీఫ్ పదవి నుంచి తొలగించి, ఆయన స్థానంలో తగిన వ్యక్తిని నియమించాలని తెలంగాణ హైకోర్టు సీఎస్‌ను ఆదేశించింది. ఆయనపై ఏకంగా 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయని పేర్కొంది. ఈ విషయాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది.

లోతుకుంటలోని 40 ఎకరాల భూమికి సంబంధించి శాంత శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన ధిక్కార పిటిషన్‌పై విచారణ జరిపింది హైకోర్టు. కోర్టు ఆదేశాలు ఉన్నా.. హైడ్రా అధికారులు తమ భూముల్లోకి వచ్చి జోక్యం చేసుకుంటున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక అధికారిపై 63 కోర్టు ధిక్కరణ కేసులు ఉండటం ఏంటని అడిగింది.

గతంలో విచారణ సందర్భంగా కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు క్షమాపణలు చెబుతూ, హైడ్రా మళ్లీ ఆ ఆస్తిలోకి ప్రవేశించదని హామీ ఇస్తూ, సవివరమైన అఫిడవిట్ దాఖలు చేయాలని రంగనాథ్‌ను ఆదేశించింది కోర్టు. జూలై 18న ఆస్తిలోకి ప్రవేశించడానికి గల కారణాలను కూడా రంగనాథ్ వివరించాలని తెలిపింది.

కోర్టు ఆదేశాల మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టులో అఫిడవిట్ సమర్పించారు. న్యాయస్థానానికి క్షమాపణలు తెలిపారు. తనకు కోర్టులు అంటే ఎంతో గౌరవం, నమ్మకం ఉన్నాయని పేర్కొన్నారు. లోతుకుంటలోని 40 ఎకరాల స్థలంలోకి హైడ్రా సిబ్బంది అసలు వెళ్లలేదని, పిటిషనర్ కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని రంగనాథ్ తన అఫిడవిట్‌లో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనల తీరుపై హైకోర్టు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేసింది. హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి రంగనాథ్‌ను తొలగించాలని ఆదేశించింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More