HYDRAA : హస్మత్‌పేటలో ‘హైడ్రా’ భారీ ఆపరేషన్ - రూ.750 కోట్ల విలువైన ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్
HYDRAA Operation Hasmathpet : హైదరాబాద్ హస్మత్‌పేటలో హైడ్రా శనివారం భారీ ఆపరేషన్ నిర్వహించింది. సర్వే నంబర్ 1లో ఆక్రమణలకు గురైన రూ. 750 కోట్ల విలువైన 10 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. రక్షణగా ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది.
HYDRAA Operation Hasmathpet : హైదరాబాద్ మహానగర పరిధిలో చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) శనివారం మరో భారీ ఆపరేషన్ చేపట్టింది. మేడ్చల్ - మల్కాజగిరి జిల్లా, బాలానగర్ మండలం పరిధిలోని హస్మత్‌పేటలో అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల నుంచి విడిపించింది. సర్వే నంబర్ 01లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసి, సుమారు 10 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. బహిరంగ మార్కెట్లో ఈ భూమి విలువ దాదాపు రూ. 750 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

హైడ్రా ప్రకటనలోని వివరాల ప్రకారం…… హస్మత్‌పేట సర్వే నంబర్ 01 లో మొత్తం 108 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, అందులో ఇప్పటికే 98 ఎకరాలు రకరకాలుగా కబ్జాకు గురైంది. కబ్జాదారులు ఎవరికి వారే గ్రూపులుగా ఏర్పడి, ఆ భూమిని వంద గజాల చొప్పున ప్లాట్లుగా మార్చి ఇతరులకు అక్రమంగా విక్రయించారు. దీంతో అక్కడ ఇప్పటికే పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలు జరిగి, వందలాది కుటుంబాలు నివాసం ఉంటున్నాయి.
మానవతా దృక్పథంతో ఆలోచించిన హైడ్రా అధికారులు.. ఇప్పటికే నివాసాలు ఉంటున్న ఇళ్ల జోలికి వెళ్లకుండా, ఖాళీగా ఉండి ఆక్రమణకు గురవుతున్న భూమిపైనే ఈ ఆపరేషన్ నిర్వహించారు. స్థానిక రెవెన్యూ అధికారులు ఇచ్చిన లిఖితపూర్వక లేఖ ఆధారంగా ఈ చర్యలు చేపట్టారు. శనివారం ఉదయం రెవెన్యూ అధికారుల సమక్షంలో…. భారీ పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా బృందాలు రంగంలోకి దిగి ఆక్రమణలను తొలగించాయి.
- మొత్తం భూమి: 108 ఎకరాలు (కబ్జా అయినది: 98 ఎకరాలు).
- తాజాగా కాపాడిన భూమి: 10 ఎకరాలు (మార్కెట్ విలువ రూ. 750 కోట్లు).
- అక్రమ ప్రహరీలు, తాత్కాలిక షెడ్ల కూల్చివేత, ప్రభుత్వ భూమిగా బోర్డుల ఏర్పాటు మరియు రక్షణ ఫెన్సింగ్.
కబ్జాదారులు ఈ మిగిలిన 10 ఎకరాల భూమిని కూడా ఆక్రమించుకునేందుకు ముఠాలుగా ఏర్పడ్డారు. భూమి చుట్టూ ముందస్తుగా తయారు చేసిన 'ప్రీకాస్ట్ ఇటుకల'తో రాత్రికి రాత్రే ప్రహరీ గోడలు నిర్మించారు. మరికొన్ని చోట్ల చిన్న చిన్న గదులు, తాత్కాలిక షెడ్లు వేసి ఆక్రమించారు. ఈ స్థలాలు తమవేనని నమ్మించేందుకు కబ్జాదారులు వారి సొంత మనుషులను అక్కడ కాపలాగా కూడా ఉంచారు. వీటిని వంద గజాల ప్లాట్ల రూపంలో అమాయక ప్రజలకు తెగనమ్మేందుకు ప్రయత్నాలు సాగుతున్న తరుణంలో హైడ్రా వీటికి గట్టి చెక్ పెట్టింది.
భారీ జేసీబీలతో రంగంలోకి దిగిన సిబ్బంది.. ప్రీకాస్ట్ వాల్స్‌తో పాటు తాత్కాలికంగా వేసిన షెడ్లను పూర్తిగా నేలమట్టం చేశారు. భవిష్యత్తులో మళ్లీ కబ్జాలకు ఆస్కారం లేకుండా భూమి చుట్టూ ఇనుప ఫెన్సింగ్ వేశారు. అంతేకాకుండా… అదంతా ప్రభుత్వ భూమి అని హెచ్చరిస్తూ స్పష్టమైన బోర్డులను అక్కడ ఏర్పాటు చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

