HYDRAA Bike Teams : ఇక రంగంలోకి 'హైడ్రా బైక్ టీమ్స్' - చెట్లు ప‌డిన వెంట‌నే తొలగించేస్తారు..!

HYDRA Emergency Bike Teams : హైదరాబాద్‌లో వర్షాకాలం నేపథ్యంలో హైడ్రా ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ట్రాఫిక్ జామ్స్, ఇరుకు సందుల్లోనూ వేగంగా దూసుకెళ్లి సహాయక చర్యలు అందించేందుకు 20 బైక్ టీమ్‌లను 3 షిఫ్టుల్లో అందుబాటులోకి తెచ్చింది.

Published on: Jun 14, 2026, 07:22:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భాగ్యనగరంలో వర్షాకాలం ఆరంభమైంది. నగరంలో కురుస్తున్న గాలీవానలు, భారీ వర్షాలు నగరవాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కేవలం అరగంట, గంట వ్యవధిలోనే ఏకంగా 10 సెంటీమీటర్ల మేర అత్యధిక వర్షపాతం నమోదవుతోంది. దీంతో ఓవైపు రహదారులు వ‌రద నీటితో ముంచెత్తుతుంటే.. మరోవైపు ఈదురు గాలులకు భారీ చెట్లు, కొమ్మలు విరిగి దారికడ్డంగా పడిపోతున్నాయి. ఫలితంగా నగరంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయి, అత్యవసర సహాయక చర్యలు చేపట్టడానికి తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి.

హైడ్రా స‌హాయ‌క చ‌ర్య‌ల్లో బైక్ టీమ్‌లు
హైడ్రా స‌హాయ‌క చ‌ర్య‌ల్లో బైక్ టీమ్‌లు

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సాధారణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) భారీ వాహనాలు వెళ్లేందుకు వీలులేని ఇరుకు మార్గాల్లోనూ తక్షణమే స్పందించేందుకు 'హైడ్రా బైక్ టీమ్‌లు' రంగంలోకి దిగాయి. గతంలో హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ బైక్ టీమ్‌లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా…. ఈసారి వర్షాకాలంలో ఈ బైక్ సిబ్బందిని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని హైడ్రా కమిషనర్ కీలక చర్యలు తీసుకున్నారు.

ప్రత్యేక బైక్ టీమ్స్…

హైడ్రా ఆధ్వర్యంలో మొత్తం 20 ప్రత్యేక బైకులను డీఆర్ఎఫ్ వాహనాలకు అనుబంధంగా ఎప్పుడూ సిద్ధంగా ఉంచుతున్నారు. ఈ బైక్ టీమ్‌లు 24 గంటలూ (24x7) అందుబాటులో ఉంటూ అత్యవసర సేవలందిస్తాయి. మొత్తం 60 మంది సిబ్బందిని మూడు షిఫ్టులుగా విభజించి విధుల్లో ఉంచారు. నగరంలోని అత్యంత కీలకమైన, సమస్యాత్మక ప్రాంతాలతో పాటు ప్రధాన రహదారుల వెంట ఉండే డీఆర్ఎఫ్ ట్రక్కుల వద్దే ఈ బైకులను పార్క్ చేస్తారు. ఎక్కడైనా ఆటంకం ఏర్పడితే భారీ వాహనం కంటే ముందే ఇవి దూసుకెళ్తాయి.

ఈ బైకులకు ప్రత్యేకంగా 'టూల్ బాక్సులు' అమర్చారు. ఆ బాక్సుల్లో బ్యాటరీతో నడిచే రెండు ఆధునిక చైన్ సా (రంపాలు), ఒక బలమైన తాడు (రోప్) ఉంటాయి. రోడ్డుపై చెట్లు పడిన వెంటనే ఈ చైన్ సాల సహాయంతో కొమ్మలను వేగంగా నరికి, తాడుతో పక్కకు లాగేసి ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తారు.

నగరంలో ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న డీఆర్ఎఫ్, మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లు, స్టాటిక్ టీమ్‌లకు అదనపు బలగంగా ఈ బైక్ టీమ్‌లు పనిచేస్తాయి. రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడినా.. ఈ బైకులను ఫుట్‌పాత్‌ల మీదుగా పోనిచ్చి మరీ ఘటనా స్థలానికి చేరుకుంటారు. ఒకవేళ బైక్ కూడా వెళ్లే వీలు లేనంతగా వాహనాలు నిలిచిపోతే, సిబ్బంది చేతులతోనే ఆ పనుముట్లను పట్టుకుని పరుగులు తీస్తూ స్పాట్‌కు చేరుకుంటారు.

వాటర్ లాగింగ్ పాయింట్లలో మల్టీ టాస్కింగ్

ఈ బైక్ టీమ్‌లు కేవలం చెట్లను తొలగించడానికే పరిమితం కాలేదు. రహదారులపై భారీగా నీరు నిలిచిపోయే వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద డ్రైనేజీలు బ్లాక్ అయితే, గడ్డపారలు, ఇతర పారలతో రంగంలోకి దిగుతాయి. వెనువెంటనే వరద నీరు పోయేలా చర్యలు చేపట్టి రాకపోకలను పునరుద్ధరిస్తాయి. ఈ విధమైన మల్టీ టాస్కింగ్ పనులు చేసేందుకు వీలుగా హైడ్రా వీరికి ప్రత్యేక రక్షణ శిక్షణ ఇచ్చింది. ప్రతి బైక్ టీమ్‌లో ఒక డీఆర్ఎఫ్ సీనియర్ సిబ్బంది తోడుగా ఉండి పనులను పర్యవేక్షిస్తారు.

మెట్ టీమ్‌లు, స్టాటిక్ టీమ్‌లు, డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి ఈ బైక్ టీమ్‌లు సమన్వయంతో పనిచేస్తున్నాయి. శుక్రవారం రాత్రి బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 1 లో ఇరువైపులా వరుసగా 3 భారీ చెట్లు కూలిపోయాయి. అదే సమయంలో నిమ్స్ (NIMS) ఆస్పత్రిలోని మిలీనియం బ్లాక్‌పై కూడా పెద్ద చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో భారీ డీఆర్ఎఫ్ ట్రక్కులు ట్రాఫిక్ వల్ల ఘటనా స్థలానికి రావడంలో ఆలస్యం అయ్యే పరిస్థితి కనిపించింది.

దీంతో హైడ్రా బైక్ టీమ్‌లు తమ చైన్ సాలతో నిమ్స్ బిల్డింగ్ కిటికీల ద్వారా లోపలికి ప్రవేశించి, అత్యంత వేగంగా చెట్లను నరికి తొలగించారు. అలాగే రోడ్డుపై పడిన కొమ్మలను కూడా క్షణాల మీద తొలగించి, రోగి వాహనాలకు, సాధారణ ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More