Hyderabad : కొండాపూర్లో 'హైడ్రా' భారీ ఆపరేషన్ - రూ.1400 కోట్ల విలువైన భూమికి ఫైన్సింగ్
హైదరాబాద్ సిటీలో హైడ్రా భారీ ఆపరేషన్లు చేస్తోంది. కబ్జాకు గురైన ప్రభుత్వ భూముల వివరాలను పక్కాగా బయటికి తీసే పనిలో పడింది. తాజాగా కొండాపూర్‌లో 7 ఎకరాలను భూమిని కాపాడింది. రూ. 1400 కోట్ల విలువ చూసే ఈ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసింది.
కొండాపూర్‌లో 7 ఎకరాల మేర ఉన్న పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను హైడ్రా శనివారం కాపాడింది. వీటి విలువ రూ. 1400 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను హైడ్రా ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

కాలనీ వాసుల ఫిర్యాదు - రంగంలోకి హైడ్రా
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ విలేజ్‌లోని సర్వే నంబరు 78 నుంచి 93 లో రాజరాజేశ్వరి నగర్ కాలనీ పేరుతో 2059 ప్లాట్లతో 1993లో గ్రామపంచాయతీ లే ఔట్ వేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 5 ఎకరాలు కేటాయించారు. అలాగే పాఠశాలకు దాదాపు ఎకరా స్థలం,పార్కుల కోసం ఎకరాకు పైగా కేటాయించారు. పాఠశాలకు కేటాయించిన స్థలంలో 1000 గజాల మేర అపార్టుమెంట్‌ను నిర్మించేశారు. కమ్యూనిటీ హాల్ కోసం 2181 గజాలను కేటాయించారు. ఇలా కేటాయించిన భూములు ఆక్రమణలకు గురౌతున్నాయని వెంటనే కాపాడి రాజరాజేశ్వరి నగర్‌లో నివాసం ఉంటున్న 5 వేల కుటుంబాలకు ఉపయోగపడేలా చూడాలని హైడ్రా ప్రజావాణిలో కాలనీ సంక్షేమ సంఘం కోరింది.
ఈ భూముల ఆక్రమణల వెనుక బడాబాబులున్నారని ఫిర్యాదు చేసింది. పలు షోరూంలతో పాటు.. కిరాణా జనరల్ స్టోర్‌లు వచ్చాయని.. రహదారులు కూడా ఆక్రమణలకు గురౌతున్నాయని ఫిర్యాదులో పేర్కొంది. యూఎల్సీ భూములలోని లే ఔట్లో ప్లాట్లు ఎల్ ఆర్ ఎస్ అయ్యాయి. పార్కులు, ప్రజావసరాల స్థలాలు ఎల్ ఆర్ ఎస్ అవ్వకుండా ఆక్రమణదారుల సొంతం ఎలా అవుతాయని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. అవి పార్కులాగాను ప్రజావసరాల స్థలాలగానే ఉపయోగపడాలని కోరారు.
ఈ ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారులతో హైడ్రా క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. లే ఔట్ ప్రకారం పార్కుతో పాటు ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలుగా నిర్ధారించుకుంది. పార్కు స్థలంలో ఇప్పటికే వెయ్యి గజాల మేర అపార్టుమెంట్ రాగా.. కమ్యూనిటీ స్థలంలో పైవేటు షాపులు, షెడ్డులు వేసినట్టు గుర్తించింది.
ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు.. అక్కడి నివాసితులకే చెందాలనే ఉద్దేశంతో ఆక్రమణలు తొలగించి ఫెన్సింగ్ వేసింది. ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలుగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది. దీంతో రాజరాజేశ్వరి నగర్ నివాసితులు హర్షం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్య హైడ్రాతో పరిష్కారం అయ్యిందని సంతోషం వ్యక్తం చేశారని హైడ్రా వెల్లడించింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

