హైడ్రా కమిషనర్‌తో ఫోన్ ఇన్ కార్యక్రమం.. 2100 గజాల పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా
ప్రతి శనివారం ఫోన్‌లో ఫిర్యాదుల స్వీకరణకు హైడ్రా కమిషనర్ ఫోన్ ఇన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్.
ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్న హైడ్రా ఇప్పుడు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి శనివారం ఫోన్-ఇన్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని హైడ్రా నిర్ణయించింది. ఈ శనివారం నుంచే ప్రారంభించాలని హైడ్రా బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. సెలవు రోజులు మినహా.. ప్రతి శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు పేర్కొంది.

ఔటర్ రింగురోడ్డు పరిధిలో ఉన్న నగర ప్రజలు 040-29565750, 040-29565759 ఈ రెండు ఫోను నంబర్లకు ఫోను చేసి ఫిర్యాదులు చేయవచ్చునని తెలిపింది. చెరువులు, పార్కులు, రహదారులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల ఆక్రమణలు, చెరువుల్లో మట్టి పోయడం వంటి అంశాలపై ఫిర్యాదు చేయవచ్చునని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. గతంలో ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులు ఏవైనా పరిష్కారం కాకపోతే.. వాటి గురించి కూడా ఈ ఫోన్ ఇన్ కార్యక్రమంలో తెలుసుకోవచ్చన్నారు.
కాముని చెరువు అభివృద్ధి
హైడ్రా కమిషనర్ రంగనాథ్ బుధవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భరత్‌నగర్ - ఖైతలాపూర్ - హైటెక్ సిటీ రోడ్డుకు ఎడమవైపు ఉన్న కాముని చెరువు మురుగు నీటితో దుర్గంధభరితంగా మారడంతో గుర్రపు డెక్క వ్యాపించి దోమల బెడదతో రోగాలభారిన పడుతున్నామని స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ చెరువు చుట్టూ ఉన్న ఆక్రమణలను తొలగించి చెరువును అభివృద్ధి చేయాలని హైడ్రా కమిషనర్‌ను కోరారు. చెరువు ఇన్‌లెట్లు, ఔట్‌లెట్లను పరిశీలించి.. వెంటనే ఈ చెరువు అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను హైడ్రా కమిషనర్ ఆదేశించారు.
అలాగే జలమండలికి-స్థానికంగా ఉన్న ముస్లింలకు మధ్య ఉన్న గ్రేవ్‌యార్డు స్థలవివాదాన్ని కూడా కమిషనర్ పరిశీలించారు. ఇక్కడ అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమి వివరాలు తెలుసుకుంటామని.. తర్వాత గ్రేవ్‌యార్డు సమస్య పరిష్కరిస్తామని హైడ్రా కమిషనర్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రభుత్వ భూమి ఎంత అందుబాటులో ఉందో తెలుసుకుని ఆ మేరకు ఫెన్సింగ్ వేయాలని హైడ్రా అధికారులను కమిషనర్ ఆదేశించారు. తర్వాత కూకట్‌పల్లి, శంషిగూడలోని శిల్పా బృందావన్ కాలనీ హెచ్ఎండీఏ లే ఔట్‌ను మార్చేసి.. పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని లే ఔట్ వేస్తున్నారనే ఫిర్యాదును కూడా హైడ్రా కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇక్కడ ప్రభుత్వ భూమి వివరాలు తెలుసుకుని ఆ మేరకు ఫెన్సింగ్ వేయాలని సూచించారు.
తుర్క చెరువును అభివృద్ధి చేస్తాం
నిజాంపేటలోని బండారీ లేఔట్‌కు ఆనుకుని ఉన్న తుర్క చెరువును కూడా హైడ్రా అభివృద్ధి చేస్తోందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు వివరించారు. చెరువులోకి మురికి నీరు చేరి పరిసరాలన్నీ దుర్గంధభరితంగా.. దోమల బెడదతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు. 43.50 ఎకరాల చెరువును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. ముందుగా మురుగునీరును బయటకు పంపి.. పూడికను తొలగించిన తర్వాత చెరువు సుందరీకరణ పనులు చేపడతామన్నారు.
2100 గజాల పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం, మీర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలోని నంది హిల్స్ కాలనీలోని 2100 గజాల పార్కు స్థలాన్ని హైడ్రా పరిరక్షించింది. కాలనీలో ప్రజావసరాల కోసం కేటాయించిన ఈ పార్కు స్థలంలో కొంత భాగాన్ని కొందరు రాజకీయ నాయకుల బై నంబర్ వేసి ఆక్రమించారు. నకిలీ లేఅవుట్లు సృష్టించారని కాలనీ వాసులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి.. రికార్డులను పరిశీలించిన అనంతరం ఆక్రమణలు జరిగినట్టు నిర్ధారించారు. వెంటనే చర్యలు తీసుకుని 2100 గజాల పార్కు స్థలాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుని ప్రజావసరాలకు కాపాడారు. హైడ్రా చర్యలను స్థానికులు అభినందించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


