ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ పిలిస్తే వెళ్తా.. మా ఫోన్లూ ట్యాప్ చేశారు : కవిత

ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను సిట్ పిలిస్తే.. వెళ్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. చట్టలను అందరూ గౌరవించాలని చెప్పారు.

Published on: Feb 2, 2026, 13:28:06 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. సిట్ విచారణలో ఏం జరిగిందో మాజీ సీఎం కేసీఆర్ చెప్పే ఉంటారని భావిస్తున్నట్టుగా కవిత పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు రెండేళ్లు అవుతున్నా.. విచారణ ముగింపునకు రావడం లేదన్నారు. విచారణ ముగిసి.. త్వరగా దోషులకు శిక్ష పడేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

కవిత మీడియా సమావేశం
కవిత మీడియా సమావేశం

సిట్ విచారణను కేటీఆర్ తప్పుపట్టడం సరికాదని కవిత అన్నారు. చట్టాలను అందరూ గౌరవించాలని, సహకరించాలని వ్యాఖ్యానించారు. గుంట నక్కలతో కలిసి కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడుతుందని విమర్శించారు. తనతోపాటుగా తన భర్త ఫోన్లు కూడా ట్యాప్ చేశారనే అనుమానాలు ఉన్నాయన్నారు. సిట్ విచారణకు అధికారులు పిలిస్తే.. వెళ్లి సహకరిస్తానని చెప్పారు.

'ఫోన్ ట్యాపింగ్ కేసును పారదర్శకంగా విచారణ జరపాలి. కేసీఆర్ గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. అందుకే సిట్ విచారణకు పిలిచింది. విచారణకు పిలిస్తే ఎవరైనా వెళ్లకతప్పదు. సిట్ పిలిస్తే నేను కూడా విచారణకు వెళ్తాను. చట్టానికి ఎవరూ చుట్టం కాదు. కాంగ్రెస్ తో గుంటనక్క హరీశ్ రావు కుమ్మక్కయ్యారు.' అని కవిత విమర్శించారు.

మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున మంచోళ్లైనా, చెడ్డొళ్లైనా, పొడుగోడైనా, పొట్టొడైనా కారు గుర్తుపై ఓటు వేయాలని కేటీఆర్ చెప్పిన విషయాన్ని కవిత గుర్తు చేశారు. అంటే చెడ్డ వ్యక్తులకు ఓటు వేయాలని కేటీఆర్ చెబుతున్నారా? అని అడిగారు. కేటీఆర్ మాటలు నియంతృత్వం, రాచరికపు పోకడలకు నిదర్శనం అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కులం కాదు.. గుణం చూసి ఓటేయాలని కోరారు. డబ్బులు కాదని, పని చేసేవాళ్లకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మంచి అభ్యర్థులకు ఓటు వేయాలని, తెలంగాణ జాగృతి తరఫున పలువురు ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై పోటీ చేస్తున్నట్టుగా స్పష్టం చేశారు కవిత.

'తెలుగు ఇంటి ఆడబిడ్డ అయిన నిర్మలా సీతారామన్ మరోసారి బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడుల పేరుతో ఫేక్ కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకుంటుంది. వాటిని బహిర్గతం చేయాలి. హైదరాబాద్‌లో వరుసగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గంజాయి ముఠా దాడులకు పాల్పడుతోంది. ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఫిబ్రవరి 20 నుంచి తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమం చేపడుతుంది. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తాం.' అని కవిత అన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More