వేసవి రావటంతో ఎండలతో తెలంగాణ వాసులు ఇబ్బందిపడుతున్నారు. ఉదయం 10 దాటితే చాలు… ఎండ తీవ్రత కనిపిస్తోంది. మధ్యాహ్నం సమయంలో అయితే భానుడి భగభగలు ఎక్కువగానే ఉంటున్నాయి. ఆ సమయంలో బయటికి వెళ్లాలంటే వెనకడుగు వేస్తున్నారు. మార్చి నెలలోనే ఈస్థాయి ఎండల తీవ్రత ఉండటంతో…. రాబోయే రోజుల్లో ఎండలు ఎక్కువగానే ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
ఈనెల 15 నుంచి వర్షాలు…

ఇప్పుడిప్పుడే ఎండల తీవ్రత మొదలు కాగా…. తెలంగాణకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. మార్చి 15వ తేదీ నుంచి రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. కొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను కూడా జారీ చేసింది.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ ప్రకారం…. మార్చి 14వ తేదీ వరకు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుంది. అయితే మార్చి 15వ తేదీ నుంచి వాతావరణం మారే అవకాశం ఉంది. రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇంకొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30–40 కిమీ)తో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయి. రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలలో అకస్మాత్తుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
మార్చి 16, 17 తేదీల్లో కూడా రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ తేదీల్లో ఎలాంటి హెచ్చరికలు జారీ కాలేదు.