Telangana Rains : తెలంగాణ వెదర్ అప్డేట్.. ఈ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం
IMD Weather Forecast : తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం ఉదయం వరకు కొన్ని ప్రాంతాల్లో వానలు పడనున్నాయి.
తెలంగాణలో అక్టోబర్ 30 శుక్రవారం నాడు వర్షాలు పడే అవకాశం ఉంది. సాయంత్రం, రాత్రి వేళల్లో పలు జిల్లాల్లో చెదురుమదురుగా మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. యాదాద్రి-భువనగిరి, జనగాం, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు వానలు పడే అవకాశం ఉంది.

ముఖ్యంగా రాత్రి సమయంలో చెదురుమదురుగా మోస్తరు వర్షాలు, ఉరుములు సంభవించే అవకాశం ఉంది. రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాల తీవ్రత రాత్రిపూట ఎక్కువగా ఉంటుందని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.
మరో అల్పపీడనం
అర్నబ్ తుపాను సృష్టించిన బీభత్సం, వర్షాల ప్రభావం నుంచి ఏపీ ప్రజలు ఇంకా తేరుకోకముందే బంగాళాఖాతం మరోసారి అల్లకల్లోలంగా మారింది. సముద్రంలో సంభవించిన వాతావరణ మార్పుల కారణంగా కొత్తగా మరో అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది.
బుధవారం నాటికి దక్షిణ అండమాన్ సముద్రం దానిని ఆనుకుని ఉన్న పరిసర ప్రాంతాల్లో బలమైన ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో గురువారం ఉదయానికి అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఒక అల్పపీడనంగా రూపాంతరం చెందిందని అధికారులు వెల్లడించారు.
ఈ అల్పపీడన వ్యవస్థ మరింత బలపడుతూ వాయువ్య దిశగా పయనించే అవకాశాలు ఉన్నాయని ఐఎమ్‌డీ వెల్లడించింది. అల్పపీడనం తీవ్రరూపం దాల్చనుంది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న అండమాన్-నికోబార్ దీవులు, అండమాన్ సముద్ర ప్రాంతాల్లో ఇది వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇది తుపానుగా మారే అవకాశం ఉందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఈ కొత్త వాతావరణ పరిణామాన్ని వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో అత్యంత అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే అర్నబ్ తుపాను వల్ల తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు నమోదయ్యాయి. తెలంగాణలోని కొన్ని ప్రంతాల్లోనూ వానలు పడ్డాయి. హైదరాబాద్‌లో వాతావరణం చల్లగా ఉంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


